యాపిల్ సేల్స్‌..ఆల్‌టైమ్ రికార్డు

4
- Advertisement -

టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో ఎన్నడూ లేనంత అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది. అదే సమయంలో మ్యాక్ కంప్యూటర్లు, సర్వీసుల విభాగాల్లోనూ రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించింది. ఐఫోన్‌లను కొత్త మోడళ్లకు అప్‌గ్రేడ్ చేసుకున్న వినియోగదారుల సంఖ్య కూడా సెప్టెంబర్ త్రైమాసికంలో గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో భారత మార్కెట్లో యాపిల్ వ్యాపారం బలమైన వృద్ధిని కనబరిచింది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కలిగిన యాపిల్‌కు భారత్ కీలక మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలపై నిర్వహించిన ఆదాయ ప్రకటన సందర్భంగా కంపెనీ సీఈఓ జాన్ టెర్నస్ ఈ విషయాలను వెల్లడించారు. అమెరికా, యూరప్, గ్రేటర్ చైనా, ఆసియా-పసిఫిక్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ కంపెనీ ఆదాయ పరంగా సెప్టెంబర్ త్రైమాసిక రికార్డులను నమోదు చేసిందని తెలిపారు.

అభివృద్ధి చెందిన మార్కెట్లతో పాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోనూ సెప్టెంబర్ త్రైమాసికంలో రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించామని, భారత్‌లో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అత్యధిక ఆదాయం నమోదైందని టెర్నస్ పేర్కొన్నారు.

Also Read:మంత్రి శ్రీధర్ బాబు vs ఎంపీ వంశీకృష్ణ

భారత్‌లో ఐఫోన్‌లను కొత్త మోడళ్లకు అప్‌గ్రేడ్ చేసుకున్న వినియోగదారుల సంఖ్య కూడా ఈ త్రైమాసికంలో గరిష్ఠ స్థాయికి చేరిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అప్‌గ్రేడ్ చేసుకున్న వినియోగదారుల విషయంలోనూ యాపిల్‌కు ఇదే అత్యుత్తమ ఆర్థిక సంవత్సరంగా నిలిచిందని వెల్లడించారు.

మరోవైపు సరఫరా పరిమితులు, విదేశీ మారకపు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 17 శాతం పెరిగి 57.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

- Advertisement -