విద్యుత్ సామర్థ్యం ఉన్నా కోతలెందుకు?

4
- Advertisement -

రాష్ట్రంలో 27 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, 20 వేల మెగావాట్ల డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో తీర్చలేకపోతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ డిమాండ్ అకస్మాత్తుగా పెరిగిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్ల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో 7,800 మెగావాట్ల విద్యుత్‌ను హైబ్రిడ్ విధానంలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయడంపై జగదీష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనలకు అనుమతి ఇస్తే విద్యుత్ కొనుగోలు చేసినట్లు చూపించి, ఆ ఖర్చులను ట్రూఅప్ ఛార్జీల పేరుతో తిరిగి ప్రజల నుంచే వసూలు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో కూడా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా 4 వేల మెగావాట్లు పెరిగిందని, అయినప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. ప్రస్తుతం 20 వేల మెగావాట్ల డిమాండ్‌ను కూడా తీర్చలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెంచాలనుకుంటే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఆ దిశగా చర్యలు చేపట్టాలని జగదీష్ రెడ్డి సూచించారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలపై ఆధారపడటం సరైన విధానం కాదన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ కొనుగోలు విధానానికి తాము అంగీకరించడం లేదని, ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడే నిర్ణయాలను ఆమోదించకూడదని పబ్లిక్ హియరింగ్‌లో స్పష్టంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిపారు.

Also Read:మంత్రి శ్రీధర్ బాబు vs ఎంపీ వంశీకృష్ణ

- Advertisement -