స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి దేశాన్ని పరిశుభ్రపరిచే కార్యక్రమానికి నడుం బిగిద్దామని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోదీ.
ఈ క్రమంలోనే ‘స్వచ్ఛతా హీ సేవా’ ఉద్యమంలో భాగం కావాలంటూ ప్రధాని మోదీ వివిధ రంగాల్లోని పలువురు ప్రముఖులకు పిలుపునిచ్చారు. ఈమేరకు వారికి లేఖలు కూడ రాశారు.
మహాత్మాగాంధి స్ఫూర్తితో అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కోసం ప్రతినబూనాలని, స్వచ్ఛ సేవలో పాల్గొనాలని మోదీ తన లేఖలో కోరారు. అయితే ప్రధాని నుంచి లేఖలు అందుకున్న తెలుగువారిలో సినీ ప్రముఖులు రాజమౌళి, మోహన్ బాబు, ప్రభాస్, మహేశ్ బాబుక ఉన్నారు. మోహన్ లాల్, అనిల్ కపూర్, అనుష్కశర్మలకు కూడా మోదీ లేఖలు రాశారు.
ఇదిలా ఉంటే..టాలీవుడ్‌లో అగ్రహీరోల్లో ఒకరైన పవన్ కల్యాణ్‌కు మాత్రం మోదీ లేఖ రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ.. మోదీపై పవన్ పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
ఆ తరువాత ఏపీలో పెట్టిన సభలో మోదీ కూడా పవన్‌ను ప్రశంసించారు. కానీ.. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిపోతోంది. కేంద్ర ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేస్తోన్న నేపథ్యంలోనే ఆయనను మోదీ పక్కన పెడుతున్నట్టుగా అభిప్రాయపడుతున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.