ఏప్రిల్ 10న బెంగాల్ లో నాలుగో విడత పోలింగ్ జరుగుతున్న తరుణంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతాబలగాలు కాల్పులు జరపగా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వారం కూచ్ బెహార్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయిన అంశాన్ని… శవరాజకీయాలకు మమత వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. చనిపోయిన వారి శవాలతో ర్యాలీ నిర్వహించాలని మమత చెపుతున్నట్టు ఉన్న ఆడియో క్లిప్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై మోదీ మాట్లాడుతూ, మమత ఆడియో టేపు అందరూ విన్నారని, కూచ్ బెహార్‌లో జరిగింది ఏమిటని ప్రశ్నించారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన బాధాకర ఘటన జరిగితే… దాన్ని దీదీ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. శవరాజకీయాలు చేయడం ఆమెకు తొలి నుంచి అలవాటేనని చెప్పారు. దీదీ… మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంత దూరం వెళ్తారని మోదీ ప్రశ్నించారు. ప్రజల చావుల ద్వారా కూడా దీదీ రాజకీయ లబ్ధిని పొందాలనుకుంటున్నారనే విషయం అర్థమవుతోందని దుయ్యబట్టారు.