రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. ఇంకా అనేక చోట్ల రూ.100 కు అతి చేరువలో ఉంది. డీజిల్ సైతం ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా రూ.100 మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆల్‌టైమ్ స్థాయిలో ధరలు నమోదయ్యాయి. లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు పెరగ్గా, డీజిల్‌పై 31 పైసలు పెరిగింది.
దీంతో హైదరాబాద్‌లో రూ.100.26 పైసలకు చేరింది. పెరిగిన పెట్రోల్ ధరలపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిన సంగతి తెలిసిందే. దేశంలో పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ ఆంధోళనలు చేస్తున్నది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు 23 సార్లు ఇంధనం ధరలు పెరిగాయి. ఒక్క ఈ జూన్ నెలలోనే ఇంధనం ధరలు పెరగడం ఇది ఆరోసారి. మే 4 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ.5.81 పెరగ్గా డీజిల్ ధర రూ.6.12 మేర పెరిగింది.