మెగాస్టార్ బాటలోనే పవర్ స్టార్..

263
pawan gajuwaka
- Advertisement -

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలపై స్పష్టత వచ్చింది. రెండు స్ధానాల నుండి ఆయన బరిలో దిగనున్నారు. అందరూ ఉహించినట్లుగానే ఒకటి విశాఖ జిల్లా గాజువాక కాగా అనూహ్యంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పేరు మాత్రం అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పవన్‌ పోటీచేసే స్ధానాలపై నిర్ణయం తీసుకున్న జనసేన పార్టీ నేతలు ప్రకటన విడుదల చేశారు. గతంలో పార్టీ ప్రారంభసమయంలో అనంతపురం నుండి పోటీచేస్తానని ప్రకటించిన పవన్ తర్వాత తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

మొదటినుండి జనసేన అభిమానులు, కార్యకర్తలు అంతా పవన్‌ రెండు చోట్ల పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గాజువాక నుండి పవన్ పోటీచేయనున్నారని మొదటినుండి ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే పవన్ సైతం గాజువాక తనకు బెటర్‌ ప్లేస్‌ అని భావించారట. ఎందుకంటే లక్ష సభ్యత్వాలతో ఏపీలోనే గాజువాక నియోజకవర్గం అగ్రస్థానంలో ఉండడమే ఇందుకు కారణం. అన్నింటికి మించి విశాఖలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే గాజువాక స్ధానాన్ని ఎంచుకున్నారు పవన్‌.

ఇక రెండోస్ధానం పవన్ సొంత జిల్లా పశ్చిమగోదావరి నుండి బరిలోకి దించాలని భావిస్తే పార్టీకి మేలు జరుగుతుందని భావించారు. ఈ నేపథ్యంలోనే భీమవరంను రెండోస్ధానంగా ఎంపికచేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్ధాపించినప్పుడు రెండు చోట్ల నుండి బరిలో నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే చిరంజీవి గెలుపొందారు. అయితే అన్నయ్య బాటలోనే రెండు స్ధానాల నుండి పోటీచేస్తున్న పవన్ ఎలాంటి ఫలితాలు రాబడతారో అన్న సందిగ్దం నెలకొంది.

- Advertisement -