వేసవిలో ఈ పండ్లు తింటే ఎంతో మేలు..

197

వేసవి వచ్చిందంటే చాలు ఎండల ప్రభావం పడకుండ ఆరోగ్యంపై అధిక శ్రద్ద వహిస్తుంటారు. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎండాకాలంలో శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. నీటిని మాత్రమే తాగడంతో శరీరంలోని నీటి శాతాన్ని సరైన స్థాయిలో ఉంచుకోవడం కుదరదు. కాబట్టి నీటిశాతం అధికంగా ఉన్నపండ్లు తీసుకోవడం చాలా మంచిది. పండ్ల రసాలు, నీరు, మజ్జిగ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. వేస‌విలో మ‌నం నిత్యం తినాల్సిన పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.మ‌న‌కు ఈ సీజ‌న్‌లో తాటి ముంజ‌లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న వేడి త‌గ్గిపోతుంది. శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. ముంజ‌ల్లో ఉండే కాల్షియం, ఐర‌న్‌, జింక్‌, కాప‌ర్‌, మెగ్నిషియం, సెలీనియం త‌దిత‌ర పోష‌కాలు శ‌రీరంలో ఉండే నీటి శాతం త‌గ్గ‌కుండా చూస్తాయి. అందువ‌ల్ల శ‌రీరం ఎప్పుడూ చ‌ల్ల‌గా ఉంటుంది.

2.వేస‌విలో మ‌నం కొద్ది ప‌ని చేసినా చాలు.. చాలా త్వ‌ర‌గా అల‌సిపోతాం. అలాంట‌ప్పుడు స‌పోటా పండ్ల‌ను తింటే త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఒంట్లో ఉన్న నీరు త‌గ్గిపోకుండా ఉంటుంది.

3.వేస‌విలో మ‌నం తినాల్సిన వాటిలో ముఖ్య‌మైంది కీరదోస‌. కీర‌దోస‌లను తింటే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. శ‌రీరానికి త‌గినంత నీరు ల‌భిస్తుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు.

4.ద్రాక్షల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని వేస‌విలో తింటే శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. అలాగే శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది.

5.వేస‌విలో మనం తినాల్సిన ముఖ్య‌మైన పండ్ల‌లో ఒక‌టి పుచ్చ‌కాయ‌. పుచ్చకాయ‌లో 90 శాతం నీరే ఉంటుంది. అందువ‌ల్ల శ‌రీరానికి త‌గినంత నీరు ల‌భిస్తుంది. శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది.