తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మృతి జనసేనాని, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పార్టీ తరపున ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. విప్లవ నాయకి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్ తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాలతో తిరిగి ఇంటికి తిరిగి ఇంటికి చేరుకుంటారని దేశ ప్రజలందరితో పాటు తాను కూడా ఆశించానని… అయితే మనల్ని అందరినీ తీవ్ర దు:ఖంలో వదిలి, తిరిగిరాని లోకాలకు ఆమె వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు దశాబ్దాలకు పైగా తమిళనాడు, భారతదేశ రాజకీయాలపై ఆమె చెరగని ముద్ర వేశారని పవన్ తెలిపారు. తమిళ ప్రజలు అమ్మ గా కొలుచుకునే జయలలిత బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఆశగా, శ్వాసగా ఆమె బతికారని కొనియాడారు. పేద ప్రజల కోసం జయ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సదా ఆచరణీయమని చెప్పారు. మహిళల ప్రబల శక్తికి జయలలిత నిదర్శనమని అన్నారు. అమ్మ మరణం తమిళనాడుకే కాకుండా… యావత్ దేశానికి తీరని లోటు అని చెప్పారు. తన తరపున, జనసేన పార్టీ తరపున జయలలితకు మన:పూర్వక అంజలి ఘటిస్తున్నానని పవన్ తెలిపారు.
జయలలిత, నేను ఒకే స్కూల్లో చదివామన్నారు నటుడు సుమన్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల సీనియర్ నటుడు సుమన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. హాస్పటల్ నుండి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందని భావించినట్టు తెలిపారు. జయలలిత మహిళలకు మార్గదర్శి అని అన్నారు. ఆమె, నేను చెన్నైలోని చర్చ్ పార్క్ స్కూల్లో చదివాం. నేను థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నపుడు జయలలిత సీనియర్. ఆమె షూటింగ్ లకు వెళ్ళడం నాకు బాగా గుర్తుంది అని సుమన్ గుర్తుచేసుకున్నారు.
నటిగా కంటే మంచి డాన్సర్ గా జయలలిత ప్రసిద్ది. ఎలాంటి నేపథ్యం లేకున్నా రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో అవమానాలు ఎదురైనా తట్టుకుని నిలబడి జనామోదం పొందిన లీడర్ అయ్యారు. తమిళనాడులో జయలలిత పెట్టిన స్కీమ్స్ ప్రజలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అమ్మ క్యాంటిన్ లో చవకధరకే ఇచ్చేవారు. ఆడపిల్లలు చదువులో ముందుండాలని ల్యాప్ ట్యాప్ లు ఇచ్చారు. మహిళలకు సైకిళ్ళు, గ్రైండర్స్ , ఫ్యాన్స్ అందజేశారు. ఆమె రాజకీయ జీవితంలో బ్లాక్ మెయిల్ కు ఆస్కారం లేదు. పార్టీలో ఒక స్కూల్ మాస్టర్ గా స్ట్రిక్ట్ గా వ్యవహించేవారు. ఆమెను చూస్తే సివంగి గుర్తుకువస్తుంది. నిర్ణయాలు వెంటనే తీసుకోవడం ఆమె ప్రత్యేకత. జయలలిత బయోగ్రఫీ చూస్తే ఎందరికో ప్రేరణ కలుగుతుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని సుమన్ పేర్కొన్నారు.