తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం..

229
Panneerselvam sworn in as new Chief Minister of Tamil Nadu ...
- Advertisement -

అమ్మ జయలలిత మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన తమిళనాడు పరిపాలన బాధ్యతలను ఓ. పన్నీర్‌ సెల్వం తలకెత్తుకున్నారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు.. సెల్వం చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్‌ ధన్‌పాల్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏఐడీఎంకే కీలక నేతలు హాజరయ్యారు.

పన్నీర్‌ సెల్వంతో ప్రమాణస్వీకారం చేయించడానికి ముందు గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు భావోద్వేగంగా మాట్లాడారు. జయలలిత మరణం తనను కలిచివేసిందని, ఆమె గొప్పనాయకురాలని గవర్నర్ అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే అపోలో ఆసుపత్రికి బలుదేరిన పన్నీర్‌ సెల్వం.. అమ్మ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఈ కార్యక్రమానికి ముందు శాసనసభా పక్షం రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.

 Panneerselvam sworn in as new Chief Minister of Tamil Nadu ...

జయలలితకు అత్యంత విధేయుడిగా పన్నీరు సెల్వంకు పేరుంది. క్లిష్టసమయాల్లో కూడా ఆమె ఆయన్ను విశ్వాసంలోకి తీసుకునేవారు. గతంలో కూడా జయలలిత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకొన్నప్పుడు ఆయనే ఈ బాధ్యతలను నిర్వహించారు.

పన్నీర్‌ సెల్వం 1951, జనవరి 14న పెరియాకులంలో జన్మించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కోరిన రెండు సందర్భాల్లో పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొదట ఓ టీ స్టాల్‌ ఓనర్‌గా జీవితాన్ని ఆరంభించిన పన్నీర్‌ సెల్వం 1996లో మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 2001లో ఆరు నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకి వెళ్లడంతో ముఖ్యమంత్రి పదవిని మరోసారి చేపట్టారు. అయితే గత ఏడాది మే నెలలో జయలలిత జైలు నుంచి విడుదల కావడంతో పన్నీర్‌ సెల్వం రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇటీవల సెప్టెంబర్‌ 22న జయలలిత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో ఆమె వద్ద శాఖను పన్నీరు సెల్వకు బదలాయించారు.

- Advertisement -