నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వానాకాలం వరి కోతలు ప్రారంభమైనందున త్వరలోనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మరియు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రారంభించడానికి జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తున్నదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి రైతాంగానికి తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో PACSల ద్వారా 372, IDCM ద్వారా 15, IKPఐకెపి ద్వారా 37, హాకా ద్వారా 1,మెప్మా ద్వారా 7, మార్కెట్ కమిటీల ద్వారా 8, మొత్తం 440 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో PACS ద్వారా 295, IDCMS ద్వారా 19, IKP ద్వారా 15, మార్కెట్ కమిటీల ద్వారా 8, మొత్తం 337 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులు ఎవరు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
వరి ధాన్యాన్ని గ్రేడ్ A 1888/-, గ్రేడ్ B 1868/- మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి ఉమ్మడి జిల్లా రైతుల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తాలు,పొల్లు లేకుండా శుభ్రం చేసి, తేమ 17 శాతం మించకుండా (క్లీన్ ప్యాడి) ఎండబోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. PACS అధ్యక్షులు తమతమ సొసైటీల పరిధిలోని కొనుగోలు కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేసి రైతులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని కోరుతున్నాము.