ఓరుగల్లు కళా వైభవానికి సర్వం సిద్ధమైంది. మూడు రోజులపాటు నిర్వహించే సాహిత్య, సాంస్కృతిక సంబరాల పర్వం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఉదయం 10.30 గంటలకు హరిత హోటల్‌లో జరిగే ప్రారంభోత్సవ సదస్సు , సాహిత్య కార్యక్రమాలను పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రారంభిచారు. వరంగల్ జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మ, కలెక్టర్ ఆమ్రపాలి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నృత్య, సంగీత, నాటకాల పోటీలను నిర్వహించేందుకు పబ్లిక్‌గార్డెన్‌లో ఏర్పాట్లు చేశారు.
ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్నా అయిలయ్య, కవి రామాచంద్ర మౌళి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత అంపశయ్య నవీన్ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా కవి సమ్మేళనం, సాహిత్య సదస్సు నిర్వహించనున్నారు.
జానపద నృత్యాలు, పేరిణి తాండవాలు, ఒగ్గు కళ, శాస్త్రీయ నృత్యాలతో అలరించేందుకు కళాకారులు సిద్ధమయ్యారు. ధూంధాం ఆటలు, పాటలు.. ఉర్రూతలూగించనున్నాయి. కమ్మని కవితలు సాహితీ ప్రియుల్ని కట్టిపడేయనున్నాయి.
ఇక 17, 18 తేదీల్లో నిట్ ఆడిటోరియంతో పాటు, ఏషియన్ శ్రీదేవి మాల్‌లో షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శించనున్నారు. సాహిత్య సదస్సులు, కవిసమ్మేళనాలు జరుగుతాయి. ఇక వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ భవనం నుంచి కాళొజీ సెంటర్ వరకు వివిధ కార్నివాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎన్నో రకాల కళాఖండాల ప్రదర్శనతోపాటు, పిల్లలు, పెద్దల కోసం నోరూరించే వంటలు ఘుమఘుమలాడున్నాయి.