అన్నింటికీ ఒకటే కార్డు..

223
- Advertisement -

పెద్దనోట్ల రద్దు ప్రజల కొనుగోలు విధానాన్ని మార్చివేసింది. ఎన్నో ఏళ్లుగా నగదు లావాదేవీలు జరుగుతున్న మన దేశంలో డిజిటల్ మనీ పురుడుపోసుకుంటోంది. ఇదే అదునుగా ఎం-వ్యాలెట్లు, ఈ-కామర్స్ సంస్థలు చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు కృషిచేస్తున్నాయి. బ్యాంకులు సైతం ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఇక అన్ని రవాణా సాధనాల్లో చెల్లుబాటయ్యేలా ‘మెట్రో స్మార్ట్‌ కార్డు’ రాబోతోంది. నగదు రహిత లావాదేవీలపై చర్చ జరుగుతున్న తరుణంలో అధునాతనంగా ఈ కార్డును తీసుకొచ్చేందుకు హెచ్‌ఎంఆర్‌, ఎల్‌ అండ్‌ టీ వేర్వేరు బ్యాంకులు, సంస్థలతో చర్చలు సాగిస్తున్నాయి. మెట్రో ప్రారంభంతోనే ఇది రాబోతోంది.

banner-metro - Copy

ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన నగరాలన్నింటికీ ఒక ప్రత్యేకమైన కార్డు ఉంది. వేర్వేరు పేర్లతో ఉన్న ఈ కార్డు అక్కడి బస్సు, రైలు, మెట్రో, ట్రామ్‌, క్యాబ్‌ ఇలా అన్నింట్లోనూ చెల్లుబాటు అవుతోంది. జేబులో నగదు లేదని.. టిక్కెట్‌కు సరిపడా చిల్లర లేదని దిగులే లేదక్కడ. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో మెట్రో రైలు పరుగులు మొదలుపెట్టనుంది. ఇక ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టుగా ఉండేలా టికెటింగ్‌ వ్యవస్థలో అంతర్జాతీయ ప్రమాణాలను పరిచయం చేయబోతున్నారు. కాంటాక్ట్‌లెస్‌ స్మార్ట్‌కార్డు ఆధారితంగా పనిచేసేలా ఆటోమెటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌ వ్యవస్థను ఇప్పటికే స్టేషన్లలో ఏర్పాటు చేశారు. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ డాటా సిస్టమ్స్‌ ఇండియా సంస్థకు ఈ బాధ్యతను అప్పగించారు.

hyderabad metro - Copy

మొబైల్స్‌ ద్వారా పనిచేసేలా నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌(ఎన్‌ఎఫ్‌సీ) వ్యవస్థను అనుసంధానించారు. బ్యాంకులు, ఏటీఎం, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఇలా ఎక్కడైనా రీఛార్జి చేసుకోవచ్చు. మెట్రోలోనే కాకుండా ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌ వంటి రవాణా సాధనాలతో పాటూ 16 చోట్ల చెల్లుబాటయ్యేలా సంప్రదింపులు జరుగుతున్నాయి. పార్కింగ్‌, మెర్రి గో రౌండ్‌(షటిల్‌) బస్సులు, క్యాబ్స్‌, ఆటో, సైకిల్‌కు ఇలా అన్నిచోట్లా కార్డును ఉపయోగించవచ్చు.

ఇక జంట నగరాల్లోని పలువురు ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులు స్మార్ట్ ఫోన్ల ద్వారానే టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరు స్మార్ట్ కార్డులు వినియోగిస్తున్నారు. స్టేషన్లలో ఉన్న ఏటీవీఎం యంత్రం ద్వారా పాసింజర్, ఎంఎంటీఎస్ టిక్కెట్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మొబైల్ వ్యాలెట్ ద్వారా ఎంత దూరానికైనా టిక్కెట్లు తీసుకోడానికి అవకాశం కల్పించాలని రైల్వే నిర్ణయించింది. ఆర్టీసీ బస్సుల్లోనూ స్మార్ట్ కార్డులు జారీ చేయాలని సంస్థ గతంలోనే నిర్ణయించింది. బస్సు ఎక్కినప్పుడు ఒకసారి, దిగేటప్పుడు ఒకసారి కార్డును స్వైప్ చేయడం ద్వారా నిర్ణీత రుసుము సంస్థకు చేరుతుంది.

- Advertisement -