నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

75
kcr

దేశ ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. నోద్ద రద్దు ద్వారా రాష్ట్ర్రంలో నెలకొన్న ప్రజల ఇబ్బందులను తొలగించడానికి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇదే విషయంపై తాను కూడా స్వయంగా ప్రధాన మంత్రిని కలిసి ప్రజల ఇబ్బందులను వివరించాని గుర్తు చేశారు. ఇటు పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. శాసనసభలో నోట్ల రద్దుపై చర్చ ప్రారంభించిన సందర్భంగా సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. నోట్ల రద్దు అనేది రాష్ర్ట పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న పాలసీని విమర్శించే దిశగా చర్చ ఉండొద్దన్నారు.

kcr

రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. నగదు రహిత లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ రాష్ర్టం అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేంద్రం నిర్వహిస్తున్న వివిధ అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందని సీఎం స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామం వందశాతం నగదు రహిత గ్రామంగా మారిందన్నారు. సిద్ధిపేట నియోజకవర్గాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి జిల్లాల్లోని కొన్ని గ్రామాలను నగదు రహిత గ్రామాలుగా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు త్వరలోనే టీఎస్ వ్యాలెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. నగదు రహిత లావాదేవీలపై విధానపరమైన నిర్ణయాల కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రాష్ర్టంలో నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు.

నోట్ల రద్దు వల్ల రాష్ట్రంపై ఏర్పడిన ప్రభావంపై సీఎం ప్రకటన చేస్తూ, అవినీతి రహిత భారతాన్ని నిర్మించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. అవినీతి, ఉగ్రవాదం, నల్లధనం నిర్మూలనకు పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ నవంబర్ 8న ప్రకటించారని గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తున్నదని సీఎం తెలిపారు. నల్లధనం నిర్మూలించే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థ గాడితప్పకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నామని తెలిపారు.

నోట్ల రద్దు వల్ల ఆసరా పెన్షన్లు విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను వివరించామన్నారు. నగదు కొరత తీర్చేందుకు రెండుసార్లు ఆర్‌బీఐకి లేఖ రాశామని తెలిపారు. రూ. 500, 100 నోట్లు పంపాలని ఆర్బీఐని కోరామని చెప్పారు. రూ. 5 వేల కోట్ల చిన్న నోట్లు కావాలని ఆర్బీఐకి లేఖ రాశామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రాష్ర్టానికి ఆర్బీఐ నుంచి రూ. 19,109 కోట్లు వచ్చాయని తెలిపారు. నోట్ల రద్దు నాటి నుంచి రూ. 57,479 కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని చెప్పారు. ఏటీఎంలలో నగదు కొరతపైన కూడా ఆర్బీఐకి తెలిపినట్లు సీఎం చెప్పారు.