మా ఇంట్లో విషాదాన్ని త్వరగా మరిచిపోయి, మళ్లీ మా పెదాలపై చిరునవ్వు ప్రత్యక్షమయ్యేలా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్. హైదరాబాద్‌లో అరవింద సమేత విజయోత్సవ వేడుకలో మాట్లాడిన ఎన్టీఆర్ ఎన్ని బంధాలతో పిలిచినా పలికే ఆత్మీయుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమా చేయాలి అన్న తరుణం పన్నెండేళ్ల తర్వాత వచ్చిందన్నారు.
త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన అద్భుతమైన విజయం అన్నారు. ఒక గురువుగా వేలుపట్టి నడిపించారన్నారు. మంచికథతో సినిమా తీసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా కోసం తమన్ ప్రాణం పెట్టి పనిచేశాడని…నటీనటులు,సాంకేతిక నిపుణుల కృషి మర్చిపోలేనిదన్నారు.
తాత ఎన్టీఆర్ పేరు నిలబెట్టడమే కాదు ఆయన స్థాయి అందుకోగలిగే సత్తా, అంత ప్రయాణం, అంత వయసున్న నటుడు ఎన్టీఆర్ అని కొనియాడారు త్రివిక్రమ్. ఈ సినిమాని మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికీ, నాలుగు రోజుల్లోనే రూ.వంద కోట్లు సాధించడానికి కారణం ఎన్టీఆరే అని స్పష్టం చేశారు. ఒక పరాజయం ..ఒక విషాదం తర్వాత విడుదలైన సినిమా…
వీటన్నిటినీ దాటుకొని ఒక వెల్లువలాగా ఇంత విజయాన్నిచ్చి పండగని మా ఇళ్లలోకి తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో రామ్‌లక్ష్మణ్, నవీన్‌చంద్ర, ఎ.ఎస్.ప్రకాష్, పెంచలదాస్, శత్రు, నవీన్ నూలి, రామజోగయ్య శాస్త్రి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.