ప్రజలను డిజిటల్ పేమెంట్స్ వైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. అందులోభాగంగానే నీతి ఆయోగ్ తాజాగా ఓ స్కీమ్ ప్రవేశపెట్టబోతోంది. ఇందులోభాగంగా నవంబర్ 8 తర్వాత డిజిటల్ పేమెంట్స్ చేసిన ఓ లక్కీ విన్నర్‌కు కోటి రూపాయల ప్రైజ్‌మనీ అందించనుంది. ఈ మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి స్కీమ్ ప్రారంభ బాధ్యతలు అప్పగించింది.
ఈ పథకం కోసం ఎన్‌పీసీఐకి రూ.125 కోట్ల ప్రత్యేక నిధిని ఇవ్వనున్నారు. దేశంలో జరిగే అన్ని రీటెయిల్ పేమెంట్స్ వ్యవస్థలకు ఎన్పీసీఐ కేంద్ర సంస్థగా వ్యవహరిస్తోంది. దీనికి పది ప్రమోటర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, సిటిబ్యాంక్, హెచ్ఎస్బీసీ ఈ ప్రమోటర్ల లిస్ట్‌లో ఉన్నాయి.
డిజిటల్ పేమెంట్స్ చేసిన వారి ట్రాన్సక్షన్ ఐడీలలో మూడు నెలలకోసారి ఓ లక్కీ విజేతను ఎంపిక చేసి కోటి రూపాయలు బహుమతిగా అందించనున్నారు. ఈ లెక్కన్న డిజిటల్ పేమెంట్స్ చేసినప్పుడు అదృష్టం బాగుంటే మనం రూ.1 కోటి గెలుచుకునే అవకాశం ఉంటుంది.అదేవిధంగా వారానికి ఒకసారి డ్రా తీసి, 10 మంది కస్టమర్లను, 10 మంది వ్యాపారులను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు.ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాల్లో నివసించేవారిని డిజిటల్ లావాదేవీలవైపు మళ్ళించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకం రూపొందుతోంది.
ప్రతివారం పది మంది కస్టమర్లు, పది మంది వ్యాపారస్తులను విజేతలుగా ప్రకటిస్తారు. యూఎస్ఎస్డీ, ఏఈపీఎస్, యూపీఐ, రూపే కార్డులు ఉపయోగించి డిజిటల్ పేమెంట్స్ చేసే అందరు వినియోగదారులు, వ్యాపారస్తులు ఈ పథకానికి అర్హులు. పీవోఎస్ మెషిన్లు వాడుతున్నవారినీ పరిశీలిస్తారు. ఈ నెల చివరికల్లా ఈ స్కీమ్ ప్రారంభం అయ్యే అవకాశలున్నాయి.