ప్రపంచంలో అత్యంత క్రూరుడు, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యం పాలయ్యారు. ఈ విషయాన్ని కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ ధృవీకరించారు. అయితే ఆయనకు కరోనా సోకిందా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. జ్వరం కారణంగా తన సోదరుడు కిమ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని కిమ్ యో జోంగ్ తెలిపారు. కానీ ప్రజల పట్ల ఆయనకున్న ఆందోళనల కారణంగా ఒక్క క్షణం కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదన్నారు. అయితే కిమ్ ఎప్పుడు అనారోగ్యానికి గురయ్యారన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ సందర్భంగా దక్షిణకొరియాపై కిమ్ యో జోంగ్ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఆ దేశ కీలు బొమ్మలు తమ సరిహద్దుల్లోకి బెలూన్ల ద్వార విష వస్తువులను పంపించారని అందుకే ఉత్తర కొరియాలో వైరస్ విజృంభించిందని ఆమె మండిపడ్డారు. ఇలాంటింది మళ్లీ జరిగితే దక్షిణ కొరియా అధికార యంత్రాంగాన్ని అంతం చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు.. గత కొంత కాలంగా కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితుల గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అధిక బరువు, ధూమపానం వంటి కారణాలు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై కొన్నేళ్లుగా వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. కాగా కిమ్ కుటుంబానికి గుండె జబ్బుల చరిత్ర ఉంది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా కిమ్ ఆరోగ్యంపై వార్తలు బయటకు వస్తుంటాయి.