కరోనా నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయాలు..

395
Ministry of Health
- Advertisement -

కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని, బయటికి రావొద్దని సూచించింది. 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరగనివ్వరాదని పేర్కొంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటురంగంలోని ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసే వసతి కల్పించాలని సూచించింది. అత్యవసర, తప్పనిసరి విభాగాల ఉద్యోగులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వ గ్రూప్‌ బీ, సీ కేటగిరీల ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు రావాలని పేర్కొంది. ప్రభుత్వం చేసిన అన్ని సూచనలు రాష్ట్రాలు, ప్రజలు తప్పనిసరిగా పాటించాలంది. థియేటర్లు, పార్కులు, మ్యూజియంలు మూసివేయాలంది. ప్రజలు ఎక్కువమంది ఒకచోటకు చేరకుండా దూరం పాటించాలని సూచించింది.

అంతేకాకుండా, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ, వాణిజ్య విమానాలకు అనుమతి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 22 నుంచి కనీసం వారం రోజుల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. కొందరు విమానాశ్రయాల నుంచి తప్పించుకుని రైలు మార్గాలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లిపోతున్నందున వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే విమాన సర్వీసుల నిలిపివేత తప్పదని కేంద్రం భావిస్తోంది.

విమాన సర్వీసుల నిలిపివేత 22 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని, అప్పటివరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా భారత్ చేరుకునే ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్వారంటైన్ శిబిరాలకు తరలించాలని కేంద్రం ఆదేశించింది. 14 రోజుల పరిశీలన తర్వాత వారికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తేలితేనే బయటికి పంపాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా సంస్థలు సర్వీసులు తగ్గించుకోవాలని సూచించింది. వారం పాటు అంతర్జాతీయ సరిహద్దులు కూడా మూసివేస్తున్నట్టు స్పష్టం చేసింది.

- Advertisement -