Tirumala:టీటీడీ పాలకమండలి కీలకనిర్ణయాలు

31
- Advertisement -

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్యక్ష‌త‌న సోమ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్దగ‌ల స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణ మందిరంలో అనునిత్యం శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న హిందూ భ‌క్తులు త‌మ శుభ‌కార్యాలు, విశేష‌మైన రోజుల్లో స్వామివారి అనుగ్ర‌హం కోసం సంక‌ల్పం చెప్పుకుని య‌జ్ఞం నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేస్తాం. ఈ య‌జ్ఞం నిర్వ‌హ‌ణ‌కు చెల్లించాల్సిన రుసుమును త్వ‌ర‌లో నిర్ణ‌యిస్తాం అని చెప్పారు.

పాలక మండలి నిర్ణయాలు..

– టీటీడీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల కింద విధులు నిర్వహిస్తున్న దాదాపు 5 వేల మంది ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు, ఎఫ్‌ఎంఎస్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.12 వేల నుండి రూ.17 వేలకు పైగా పెంచేందుకు ఆమోదం. మున్సిపాలిటీల్లో విధులు నిర్వ‌హిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌తో స‌మానంగా ఈ వేత‌నం పెంపు ఉంటుంది. దీంతో వారి జీవితాల‌కు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పించిన‌ట్టు అవుతుంది.

– శ్రీ లక్ష్మీ శ్రీనివాసా మ్యాన్‌పవర్‌ కార్పొరేషన్‌ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఇంతవరకు వారి వేతనాలలో ప్రతి సంవత్సరం ఎటువంటి పెరుగుదల ఇవ్వటం జరగలేదు. దాని పర్యవసానంగా ఈ ఉద్యోగస్తుల వేతనాలు గత కొన్ని సంవత్సరాలుగా ఒకేరకంగా ఉన్నాయి. ఉద్యోగస్తులను ప్రోత్సహించడంలో భాగంగా వారి వేతనాలలో ఇకనుంచి ప్రతి సంవత్సరం 3 శాతం వేతనం పెంచేందుకు ఆమోదం. తద్వారా దాదాపు 6,600 మంది ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరుతుంది.

– గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీలో సొసైటీల ద్వారా పనిచేస్తూ ఇపుడు కార్పొరేషన్‌లోకి మారిన ఉద్యోగస్తులకు వారి పనిని గుర్తిస్తూ ప్రతి రెండు సంవత్సరముల గత సేవలకు మూడు శాతం ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు నిర్ణయించాం. దీన్ని 2023 అక్టోబరు నుండి అమలుపరిచేందుకు ఆమోదం.
అంతేగాక కార్పొరేషన్‌ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైనా ఏకారణం చేతనైనా అకాలమరణం పొందిన యెడల రూ.2 లక్షల నష్టపరిహారం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు ఆమోదం.

– ఇఎస్‌ఐ వర్తించని శ్రీ లక్ష్మీ శ్రీనివాసా మ్యాన్‌పవర్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు హెల్త్‌ స్కీమ్‌ వర్తింపచేసేందుకు ఆమోదం. ఈ హెల్త్‌ స్కీమ్‌ టీటీడీ ఆధ్వర్యంలోని వైద్యశాలల ద్వారా ఆ ఉద్యోగస్తులకు ఆరోగ్యపరమైన చికిత్సను అందజేయడం జరుగుతుంది. దీని వలన దాదాపు 1500 మంది ఇఎస్‌ఐ వర్తించని ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరుతుంది.

– త‌న మ‌ధుర‌మైన కంఠం ద్వారా అన్న‌మాచార్య సంకీర్త‌న‌ల‌కు విశేష ప్రాచుర్యం క‌ల్పించిన టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించాల‌ని కోరుతూ కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని నిర్ణ‌యం.

– తిరుమ‌ల‌లో వేలాది మంది సామాన్య భక్తులు గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైన సరైన వసతులు లేని తాత్కాలిక క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. వీరి సౌకర్యార్థం రూ.18 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, ఫుడ్‌ కౌంటర్లు, టాయ్‌లెట్లు మరియు నారాయణగిరి విశ్రాంతి గృహం సర్కిల్‌, ఆళ్వార్‌ ట్యాంకు రోడ్డు సర్కిల్‌ వద్ద రెండు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం.

– తిరుమల మొదటి ఘాట్‌ రోడ్‌లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి మోకాలిమెట్టు వరకు రోడ్డు పక్కన నడిచే భక్తులు ఎండకు, వర్షానికి ఇబ్బందులకు గురికాకుండా రూ.2.81 కోట్లతో నడకదారి షెల్టర్లు నిర్మాణానికి టెండర్లు ఆమోదం.

– యాత్రికులకు నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో తిరుమలలో ఎపి టూరిజం సంస్థ ఒక క్యాంటీన్‌ నిర్వహిస్తోంది. అదేవిధంగా అన్నమయ్య భవనం, నారాయణగిరి క్యాంటీన్లలో భక్తులకు భోజనం తక్కువ ధరకే ఇవ్వాలని గతంలోనే నిర్ణయించాం. ఇందులోభాగంగా రూ.2.93 కోట్లతో నారాయణగిరి క్యాంటీన్‌లో మూడో అంతస్తు నిర్మాణం మరియు ఇతర అభివృద్ధి పనులు చేయడానికి టెండరు ఆమోదం.

– తిరుమలలో 63 ఏళ్ల క్రితం నిర్మించిన గాయత్రీ సదన్‌, శ్రీవారి కుటీర్‌, టిబిసి-53, టిబిసి-64 తదితర 13 విశ్రాంతి గృహాలను కాటేజి డొనేషన్‌ స్కీమ్‌ కింద పునర్నిర్మాణం చేసి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఆమోదం.

– తిరుమలలోని జాపాలి తీర్థం, శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలకు వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ అధికంగా ఉంది. అదేవిధంగా హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తద్వారా భవిష్యత్తులో ఈ మార్గంలో మరింత రద్దీ పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రోడ్డు సామర్థ్యం సరిపోనందున ఆకాశగంగ నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రూ.40 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం. ఇందులో గోగర్భం డ్యామ్‌ భద్రత దృష్ట్యా రోడ్డు నిర్మాణం డ్యామ్‌కు దిగువన వచ్చేలా ప్లాన్స్‌ రూపొందించడం జరిగింది.

– తిరుమ‌ల‌లో వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద అధిక ట్రాఫిక్‌ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు రూ.10.80 కోట్లతో వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు, ఫుట్‌పాత్‌, డ్రెయిన్లు, వీధి దీపాలు, సైన్‌బోర్డులు ఏర్పాటుకు ఆమోదం. దీని వలన ఈ ప్రాంతంలోని యాత్రికులకు ట్రాఫిక్ స‌మ‌స్య తీరుతుంది.

– పురాతన కట్టడాలైన శ్రీకాళహస్తి రాజగోపురం కూలడం, శ్రీరంగంలోని మహారాజగోపురానికి ఇటీవల బీటలు రావడం మనం చూశాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భక్తుల భద్రత దృష్ట్యా ఐఐటి నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటుచేసి చాలా ఏళ్ల క్రితం నిర్మించిన టీటీడీలోని అన్ని ఆలయాలు, గోపురాల పటిష్టతను పరిశీలిస్తాం. కమిటీ నివేదిక ఆధారంగా మరమ్మతులు చేసి మరలా భావితరాల వారికి ఆలయాలు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.

– గతంలో చెర్లోపల్లి నుండి శ్రీనివాసమంగాపురం మరియు శ్రీవారిమెట్టు మార్గాలలో తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 2010వ సంవత్సరంలో రోడ్డు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం చెర్లోపల్లి నుండి శ్రీనివాసమంగాపురం దారిలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో, పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా దీన్ని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి బిటి రోడ్డు, వీధిదీపాలు, డ్రెయిన్లు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు రూ.25 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరుకు ఆమోదం.

– టీటీడీ పాఠశాలల్లో చదువుతున్న 3,259 మంది విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు 2023-24 విద్యా సంవత్సరం నుండి టీటీడీ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. గతంలో ఇస్కాన్‌ సంస్థ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసి సమీపంలోని టీటీడీ కళాశాలల హాస్టళ్ల నుండి పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. అన్నం, సాంబారు, కూర, రసం, చట్నీ, పెరుగు లేదా మజ్జిగను మెనుగా దిట్టాన్ని నిర్ణయించింది. ఇందుకుగాను సంవత్సరానికి రూ.2.63 కోట్లకు పైగా వ్యయం చేయడానికి ఆమోదం.

– టీటీడీ క‌ల్యాణ మండ‌పాల్లో వివాహాలు జ‌రిపే స‌మ‌యంలో డిజె పాటలు కాకుండా భ‌క్తిగీతాల‌తో మాత్ర‌మే సంగీత విభావ‌రి నిర్వ‌హించుకోవాల‌ని నిబంధ‌న విధించ‌డం జ‌రిగింది.

– దూరప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు తమ బస్సులు, ఇతర వాహనాలను అలిపిరిలో పార్క్‌ చేసి తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అలిపిరిలో ప్రస్తుతం 130 వాహనాలను పార్క్‌ చేసేందుకు 2.47 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 156 బస్సులు, 683 కార్లు/జీపులు, 1325 ద్విచక్రవాహనాలు పార్కింగ్‌ చేసుకునే విధంగా, 7 అదనపు టాయ్‌లెట్లు, యాత్రికులు వంట చేసుకునేందుకు అనువుగా మూడు షెడ్లు నిర్మాణానికి మరో 11.34 ఎకరాలు అభివృద్ధి చేసి, ఇక్కడ బిటి రోడ్లు, భూదేవి కాంప్లెక్సు వద్ద దర్శనటోకెన్లు పొందే భక్తులకు క్యూలైన్లు, లైటింగ్‌ తదితర వసతులు కల్పించేందుకు రూ.21.60 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపింది.

Also Read:ఓ.. ప్రగ్యా జైస్వాల్ కి ఛాన్సొచ్చింది

- Advertisement -