బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయే గూటికి చేరిన తరువాత ఆ రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను కలుపుకొని బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నితీష్ ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే అంతకు ముందు ఎన్డీయేతో తెగతెంపులు చేసుకొని ఆ తర్వాత ఇండియా కూటమిలో చేరారు. ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమికి బై బై చెప్పి ఎన్డీయేతో చేతులు కలిపారు. ఇలా గాలి ఎటువైపు విస్తే అటువైపు అన్నట్లుగా నితీష్ కుమార్ వ్యవహరిస్తుండడంతో నెట్టింట ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. పదవి కోసం, స్వార్థం కోసం నితీష్ కుమార్ పార్టీలు మారుస్తారని ఆయనొక రాజకీయ ఊసరవెల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. .
గతంలో ఇండియా కూటమిలో చేరే ముందు ఇక ఎన్డీయేతో జీవితంలో కలవనని చెప్పిన నితీష్.. ఇప్పుడు జీవితాంతం ఎన్డీయేతోనే అని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం బీజేపీ అండతో మరోసారి ముఖ్యమంత్రి అయినప్పటికి ఆయనపై అవిశ్వాస తీర్మానానికి రెడీ అయ్యాయి ప్రత్యర్థి పార్టీలు. బిహార్ లోని 243 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం జేడీయూలో 45 మంది, బీజేపీ లోని 78 మంది, ఓ స్వతంత్ర అభ్యర్థిని కలిపి బలపరీక్షలో నెగ్గాలని నితీష్ భావిస్తున్నారు. కానీ నితీష్ వ్యవహార శైలి కారణంగా జేడీయూలోని పది మంది ఎమ్మేల్యేలు అసహనంగా ఉన్నారట. వారి మద్దతు అవిశ్వాస తీర్మానంలో కరువైతే నితీష్ కుమార్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే బలపరీక్షలో నితీష్ ను గద్దె దించేందుకు ఆర్జేడి పార్టీ పట్టుదలగా ఉంది. మరి ఆసక్తికరంగా మారిన బీహార్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Also Read:ఓటీటీ :ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?