తాజాగా కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 13 మంది ఎంపీలకు మోదీ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. కేంద్ర కేబినెట్ విస్తరణలో కీలకమైన రక్షణశాఖ ఎవరికి అప్పగిస్తారన్న అంశానికి తెరపడింది.
అనూహ్యంగా నిర్మలా సీతారామన్‌కు ఈ కీలకమైన పదవి దక్కింది. ఎవరూ ఊహించనిరీతిలో ఆమెకు ఈ పదవి దక్కడం గమనార్హం. దీంతో ఇందిరా గాంధీ తరవాత భారత రక్షణ శాఖను చేపడుతున్న తొలి మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు.
అయితే పూర్తి స్థాయి రక్షణ మంత్రిగా నిర్మలా చరిత్ర సృష్టించారు. ఇందిరా గాంధీ గతంలో ప్రధాన మంత్రిగా ఉంటూ రక్షణ శాఖను తన వద్దే పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి రక్షణ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
కాగా, కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా స్వతంత్ర హోదా కలిగిన నలుగురు మంత్రులకు కేబినెట్ హోదా కల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఉదయం నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో పీయూష్ గోయల్‌కు రైల్వే శాఖను అప్పగించగా.. నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖను అప్పగించారు. అలాగే ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి మైనారిటీ అఫైర్స్ శాఖను కేటాయించారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్‌కు పెట్రోలియం శాఖను అప్పగించారు.