పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో విసృతంగా ప్రచారం చేస్తున్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ పార్లెమెంట్ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత. ప్రచారంలో భాగంగా జిల్లాలోని నందిపేట్ లో ఇవాళ ఎమ్మెల్యే షకిల్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రాబోతుందని చెప్పారు.
జాతీయ పార్టీలని చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్ లకు సరైన మెజార్టీ వచ్చే అవకాశం లేదన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రాగానే పసుపు బోర్డును తీసుకువస్తామని తెలిపారు. ఈసందర్భంగా బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ పై మండిపడ్డారు కవిత.
బీజేపీకి చిత్తశుద్ది ఉంటే వాళ్ల మేనిఫెస్టోలో పుసుపు బోర్డు అంశాన్ని పెట్టాలని ఆయనకు సవాల్ విసిరారు. పసుపు రైతులకు తాము ఆదుకుంటామని హామి ఇచ్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎర్రజోన్న రైతులకు బోనస్ లు కూడా ఇస్తామని స్పష్టం చేశారు.