లోక్‌సభలో మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీ లేకపోవడం వల్ల ఏప్రిల్ నెలలో ‘మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు’…దానితో ముడిపడి ఉన్న నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) బిల్లు-2026 వీగిపోయాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో తలెత్తిన తాజా తిరుగుబాటును ఉపయోగించుకుని జూలై మూడో వారంలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ బిల్లులను మళ్లీ ఆమోదింపజేసుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వ్యూహాలు రచిస్తోంది.
లోక్‌సభలో టీఎంసీకి ఉన్న 29 మంది ఎంపీలలో 20 మంది అసంతృప్త ఎంపీలు కాకొలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో సమావేశమయ్యారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీని చీల్చడానికి కావాల్సిన మూడింట రెండు వంతుల బలం (20 మంది) వీరికి ఉంది. వీరంతా ఒక బ్లాక్‌గా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తే లోక్‌సభలో ఎన్డీయే బలం మొదటిసారిగా 300 మార్కును దాటుతుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) చేతిలో ఓడిపోయి కాంగ్రెస్‌తో బంధాన్ని తెంచుకున్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (22 మంది ఎంపీలు) తో కూడా ఎన్డీయే చర్చలు జరుపుతోంది. అంశాల వారీగా ద్దతు ఇవ్వడానికి డీఎంకే సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఉద్ధవ్ థాకరే శివసేన (UBT) కి చెందిన 9 మంది ఎంపీలలో ఆరుగురిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మొత్తం 543 స్థానాలు ఉన్న లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ మార్కు 362. ప్రస్తుతం మూడు స్థానాలు (బసిర్‌హాట్, షిల్లాంగ్, నౌగాంగ్) ఖాళీగా ఉండటంతో సమర్థవంతమైన సంఖ్య 360 కి తగ్గింది.
ప్రస్తుత ఎన్డీయే బలం: 293,టీఎంసీ తిరుగుబాటు ఎంపీల మద్దతు (+20): 313. డీఎంకే ఎంపీల మద్దతు (+22): 335,శివసేన (UBT) లో చీలిక ద్వారా (+6): 341,ఇతర స్వతంత్రులు, క్రాస్ ఓటింగ్ ద్వారా అదనపు ఓట్లు (+5): 348. ఏప్రిల్ ఓటింగ్‌లో బిల్లు నెగ్గడానికి 352 ఓట్లు కావాల్సి ఉండగా ఎన్డీయేకు 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది కానీ ప్రస్తుత వ్యూహం విజయవంతమైతే ఎన్డీయే బలం 348 కి చేరుతుంది. అప్పుడు కేవలం 12 ఓట్ల కొరత మాత్రమే ఉంటుంది. దీనిని చిన్న పార్టీలు, క్రాస్ ఓటింగ్ ద్వారా భర్తీ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Also read:టీఎంసీపై అధిర్ రంజన్ ఫైర్
రాజ్యసభలో కూడా ఎన్డీయే బలం ఇప్పటికే 150 మార్కును దాటింది. అక్కడ మూడింట రెండు వంతుల మెజారిటీ మార్కు 164. టీఎంసీకి చెందిన సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేసి బీజేపీ ద్వారా మళ్లీ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇదే ఫార్ములాను మరికొందరు టీఎంసీ ఎంపీలు కూడా అనుసరించవచ్చని సమాచారం. దీనికి తోడు రాజ్యసభలో ఉన్న 8 మంది డీఎంకే ఎంపీలు కూడా మద్దతు ఇస్తే ఎన్డీయేకు రాజ్యసభలోనూ తిరుగుండదు. ఈ వ్యూహాలన్నీ సఫలమైతే 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉద్దేశించిన బిల్లుతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన జమిలి ఎన్నికల బిల్లును కూడా వర్షాకాల సమావేశాలలోనే ఆమోదించుకోవాలని మోదీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

