20 ఏళ్ల తర్వాత గర్వంగా ఉంది :చిరంజీవి

136
National award for satamanam bhavati
National award for satamanam bhavati

27ఏళ్ళ త‌ర్వాత హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాత‌గా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన `శ‌త‌మానం భ‌వ‌తి` సినిమాకు జాతీయ అవార్డు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గీతాంజ‌లి, శంక‌రా భ‌ర‌ణం చిత్రాల త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన తెలుగు చిత్రం `శ‌త‌మానం భ‌వ‌తి`. చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రంతో తెలుగువారి సంప్ర‌దాయాల‌ను, సంస్కృతి, బంధాల‌ను తెలియ‌జెప్పిన శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాన్నినిర్మించిన దిల్‌రాజును అల్లు అకాడ‌మీ ఆఫ్ ఆర్ట్స్ సంస్థ త‌ర‌పున ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅర‌వింద్ స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా… అల్లు అర‌వింద్ మాట్లాడుతూ – “దిల్‌రాజుతో నాకు చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. మంచి టెస్ట్ ఉన్న నిర్మాత‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాల‌ను అందించాల‌నే ఆయ‌న త‌ప‌నే ఈరోజు ఇలా `శ‌త‌మానంభ‌వ‌తి` సినిమా రూపంలో జాతీయ‌స్థాయిలో అవార్డు రావ‌డానికి కార‌ణ‌మైంది. 27 ఏళ్ళ త‌ర్వాత తెలుగు సినిమాకు నేష‌న‌ల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చిన సినిమా `శ‌త‌మానంభ‌వ‌తి` నిల‌వ‌డ‌మ‌నేది తెలుగు సినిమాలో భాగ‌మైన అంద‌రూ గ‌ర్వించే విషయం. ఇలాంటి ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన దిల్‌రాజుకి, టీంకు అభినంద‌న‌లు“ అన్నారు.

unnamed (1)

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – “మ‌న తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో రెండున్నర ద‌శాబ్దాలు త‌ర్వాత జాతీయ‌స్థాయిలో గుర్తింపు రావ‌డ‌మ‌నేది గ‌ర్వంగా ఉంది. దిల్‌రాజు, స‌తీష్ వేగేశ్న కృషితోనే ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించ‌డ‌మే కాదు, గొప్ప గౌర‌వాన్ని అంద‌రికీ తీసుకొచ్చింది. ఒక‌ప్పుడు నేను చేసిన `రుద్ర‌వీణ‌` సినిమాకు నేష‌న‌ల్ ఇంటగ్రిటీ అవార్డు వ‌చ్చింది. ఎందుకంటే న‌ర్గీస్‌ద‌త్ అవార్డు తెలుగు సినిమాల‌కు రావ‌డం అరుదు. అలాంటి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డు రావ‌డం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన అవార్డుగా భావిస్తున్నాను. తోటి నిర్మాత‌ను గౌర‌వించిన అల్లు అర‌వింద్‌గారిని అభినందిస్తున్నాను. ఇలాంటి అరుదైన గౌర‌వాన్ని తెచ్చిపెట్టిన దిల్‌రాజుగారికి, ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌, ఎంటైర్ టీంకు హృద‌య‌పూర్వ‌క కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను“ అన్నారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ – “అల్లు అర‌వింద్‌గారు ఒక నిర్మాత అయ్యి ఉండి మ‌రో నిర్మాత‌ను స‌న్మానించ‌డం చాలా గొప్ప విష‌యం. `శ‌త‌మానంభ‌వ‌తి` సినిమా చూసి మా ఆవిడ అప్పుడ‌ప్పుడు ఇలాంటి సినిమాలు చెయ్య‌వ‌చ్చు క‌దా అని న‌న్ను అడిగింది. దిల్‌రాజుగారు చాలా గొప్ప సినిమా తీశారు. నేను కూడా `శ‌త‌మానంభ‌వ‌తి` వంటి మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేయాల‌నే కోరిక క‌లిగింది“ అన్నారు.

unnamed (2)

అల్లుఅర్జున్ మాట్లాడుతూ – “నాకు దిల్‌రాజుగారితో మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రం ఒకేసారి ఇండ‌స్ట్రీలో ప్ర‌యాణం మొద‌లు పెట్టాం. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న 25వ సినిమాను నేనే చేస్తున్నాను. దిల్‌రాజుగారు త‌క్కువ స‌మ‌యంలోనే ప్రామిసింగ్‌, బెస్ట్ ప్రొడ్యూస‌ర్ అయ్యారు. గీతాంజ‌లి, శంక‌రాభ‌ర‌ణం త‌ర్వాత ఇప్పుడు శ‌త‌మానంభ‌వ‌తి చిత్రానికి జాతీయ అవార్డు రావ‌డం అరుదైన విష‌యం. జాతీయ అవార్డు రావ‌డ‌మ‌నేది నిర్మాత‌కు, నిర్మాణ సంస్థ‌కే కాదు, తెలుగు సినిమా పరిశ్ర‌మ‌కే గ‌ర్వ‌కార‌ణ‌మైన విష‌యం. బాహుబ‌లి సినిమాను తెలుగు సినిమాను నేష‌న‌ల్ స్కేల్‌లో నిలిపింది. అలాగే శ‌త‌మానంభ‌వ‌తి సినిమా కూడా తెలుగు సినిమాను నేష‌న‌ల్ స్కేల్ గుర్తింపు వ‌చ్చేలా చేసింది. ఇలాంటి సినిమాను నిర్మించిన దిల్‌రాజుగారికి,టీంకు అభినంద‌న‌లు“ అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ – “లైఫ్‌లో గ్రేట్ అచీవ్‌మెంట్ చేసిన సంద‌ర్భంలోనే జీవితంలో చాలా పెద్దగా కోల్పోయాను. ఆ బాధ ఎలాంటిదో నాకు చాలా క్లోజ్‌గా ఉండే అర‌వింద్‌గారి వంటివారికి తెలుసు. ఈ అవార్డు కంటే ప‌దిహేనేళ్ళుగా అర‌వింద్‌గారి వంటి మంచి వ్య‌క్తి చేసిన స్నేహం గొప్ప‌దిగా భావిస్తున్నాను. లైఫ్‌లో మ‌నం అనుకున్న‌వాటిలో కొన్నింటిని సాధించిన‌ప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. అటువంటి దానిలో ఈ `శ‌త‌మానంభ‌వ‌తి` సినిమా చేయ‌డం. స‌తీష్ ద‌గ్గ‌ర ఈ లైన్ విన‌మ‌ని హ‌రీష్ శంక‌ర్ చెప్పిన‌ప్పుడు లైన్ విన్నాను. అప్ప‌టి నుండి, సినిమా బాగా రావాల‌ని అంద‌రితో క‌థ‌ను షేర్ చేసుకుంటూ వ‌చ్చాను. అంద‌రి ద‌గ్గ‌ర స‌ల‌హాలు తీసుకున్నాను. అలాంటి వారిలో నాని కూడా ఒక‌డు. నాని కూడా కొన్ని స‌ల‌హాల‌నిచ్చాడు. అంద‌రినీ సినిమాలోఇన్‌వాల్వ్ చేస్తూ పూర్తి చేసి ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌ర‌కు రీచ్ అయ్యేలా చేశాం. మా ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయ్యి జాతీయ‌స్థాయిలో అవార్డు రావ‌డం హ్యాపీగా ఉంది“ అన్నారు.

హీరో నాని మాట్లాడుతూ – “`శ‌త‌మానంభ‌వ‌తి` సినిమాను ముస‌లివాళ్ళ నుండి చిన్న పిల్ల‌ల వ‌ర‌కు త‌మ సినిమా భావించారు. చాలా రోజుల త‌ర్వాత ఓ మంచి సినిమాకు ముఖ్యంగా క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా స‌క్సెస్ అయిన సినిమాకు ఇవ్వ‌డం ఇంకా గొప్ప విష‌యం. దిల్‌రాజుగారికి, టీంకు కంగ్రాచ్యులేష‌న్స్‌“ అన్నారు.
చిత్ర ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ – “చిరంజీవిగారు సినిమా స‌క్సెస్ మీట్‌కు వ‌చ్చి యూనిట్‌ను అభినందించారు. అవార్డు వ‌చ్చిన త‌ర్వాత ఇండ‌స్ట్రీ నుండి అల్లు అర‌వింద్‌గారు వ‌చ్చి అభినందించ‌డం చాలా సంతోషంగాఉంది“ అన్నారు.

హీరో శ‌ర్వానంద్ మాట్లాడుతూ – “ఒక సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గానో, అవార్డు ప‌రంగానో గుర్తింపు తెచ్చుకుంటుంది. కానీ శ‌త‌మానం భ‌వ‌తి, క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్ కావ‌డ‌మే కాకుండా జాతీయస్థాయిలో అవార్డు సాధించ‌డ‌మ‌నేది నా కెరీర్‌లో తొలిసారి. నా జీవితంలో సంతోష‌క‌ర‌మైన క్ష‌ణ‌మిది. ఈ సినిమాకు సంబంధించి అన్నీ చ‌క చ‌కా జ‌రిగిపోయాయి. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి కావ‌డం, 20-30 రోజుల్లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి కావ‌డం, సినిమా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం, ఇప్పుడు నేష‌న‌ల్ అవార్డు రావ‌డం అన్నీ త్వ‌ర త్వ‌ర‌గా పూర్త‌య్యాయి. వీట‌న్నింటికి కార‌ణం మా రాజు అన్న‌య్యే. ఆయ‌న‌న‌కు, శిరీష్‌గారికి, టీం అంత‌టికీ థాంక్స్‌“ అన్నారు.