విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను లోకేష్ వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్ల వివరాలను పవన్ కళ్యాణ్‌కు తెలియజేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.
పెట్టుబడుల ఆకర్షణ కోసం మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన చూపుతున్న చొరవను ప్రశంసించారు. ఇదే విధంగా భవిష్యత్తులోనూ పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వం మంచి ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Also Read:విశాఖ వేదికగా ‘CII సదస్సు’-2026
సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక రంగ విస్తరణకు సంబంధించి ఇద్దరు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

