ఏపీలోని విశాఖపట్నం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి వేదికైంది. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలక మలుపుగా భావిస్తున్న “CII అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు-2026” (CII Partnership Summit-2026) రెండు రోజుల పాటుఉ విశాఖలో అత్యంత వైభవంగా జరగనుంది. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
నేటి నుండి జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలకు చెందిన 18 మంది మంత్రులు, అలాగే ఆయా రంగాల్లో నిష్ణాతులైన 40 మంది అంతర్జాతీయ వక్తలు ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. పలు దేశాల పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈవోలు ఈ వేదికపై ఒకే చోట చేరనున్నారు.
ఈ రెండు రోజుల సదస్సు ద్వారా రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. వివిధ జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో 100కు పైగా అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకునేలా అధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు.
Also Read:KTR:వట్టిపోయిన శ్రీరాంసాగర్కు జీవం పోసింది కేసీఆరే!
ఈ సదస్సులో కుదరనున్న ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ.12.14 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు తరలివస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2.46 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూలతలు, మౌలిక సదుపాయాలు, నూతన పారిశ్రామిక విధానాలను ప్రపంచ దేశాల ముందుంచేందుకు ఈ సదస్సు ఒక గొప్ప వేదికగా నిలవనుంది.

