శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ట్రాన్స్జెండర్ల ప్రవేశం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తమిళనాడుకు చెందిన ట్రాన్స్‌జెండర్ మహిళకు శబరిమల ఆలయంలో దర్శనానికి అనుమతి ఇవ్వాలన్న పిటిషన్‌ను కేరళం ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ మేరకు కేరళం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆలయ ప్రవేశానికి సంబంధించి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) తీసుకున్న వైఖరికే ప్రభుత్వం మద్దతు ప్రకటించింది.
తగిన వైద్య పరీక్షలు, అధికారిక ధ్రువీకరణ పత్రాలు లేకుండా పిటిషనర్‌కు దర్శనానికి అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తిగా లేదా మహిళగా ఆమె శారీరక, జీవసంబంధిత స్థితిని నిర్ధారించే అధికారం దేవస్వం బోర్డుకు లేదని స్పష్టం చేసింది. సమర్థులైన వైద్య అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు లేని పరిస్థితిలో ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని బోర్డు అభిప్రాయపడినట్లు తెలిపింది.
తమిళనాడుకు చెందిన సత్యశ్రీ షర్మిలా రెహమతాలీ శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె గతంలో జనవరి 3, ఏప్రిల్ 15 తేదీల్లో శబరిమలను సందర్శించి దర్శనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆగస్టు 20న పంబ గణపతి ఆలయం సమీపంలో పోలీసుల తనిఖీల సందర్భంగా ఆమెను అడ్డుకున్నట్లు పిటిషన్లో తెలిపారు. అనంతరం ఆగస్టు 26న తిరువోణం సందర్భంగా దర్శనానికి అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులు, దేవస్వం బోర్డుకు వినతులు సమర్పించారు.
Also Read:KTR:వట్టిపోయిన శ్రీరాంసాగర్‌కు జీవం పోసింది కేసీఆరే!
మరోవైపు శబరిమల ఆలయ ప్రవేశానికి సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలు, మతపరమైన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని కేరళం ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన న్యాయపరమైన నిర్ణయం వచ్చే వరకు ఆలయ సంప్రదాయాలను, ఆచారాలను కాపాడాల్సిన బాధ్యత దేవస్వం బోర్డు, ఆలయ అధికారులపై ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషనర్ కోరిన ఉపశమనాలు కల్పించలేమని, ఆమె పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును కోరింది.

