తలాఖ్,తలాఖ్, తలాఖ్..అంతే..ఇలా మూడుసార్లు చెప్తేచాలు విడాకులు ఇచ్చిన్నట్టే. ఇది ముస్లిం సాంప్రదాయాల్లో ఉన్న ఆచారం. ఈ సాంప్రదాయమే ఇప్పుడు ముస్లిం మహిళలను తిప్పలు పెడుతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ముస్లిం మహిళలు కూడా తలాఖ్ తిప్పలు మాకొద్దు..అంటూ ఉద్యమాలకు సైతం తెరతీస్తున్నారు. అందుకే వివాదాస్పద ట్రిపుల్ తలాక్ విధానానికి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు ఉద్యమించారు.
దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాఖ్ ను వ్యతిరేకిస్తూ దాదాపు పది లక్షలకు పైగా ముస్లిం మహిళలు పిటీషన్ పై సంతకం చేశారు. ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేయాలని పిటీషన్లో పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు అనుసంధానమైన ముస్లిమ్ రాష్ట్రీయ మంచ్ ఈ సంతకాల సేకరణను మొదలుపెట్టింది. మూడు సార్లు తలాక్ అనగానే విడాకులు ఇచ్చే సంప్రదాయాన్ని రద్దు చేయాలని ఇప్పటికే ముస్లిం మహిళలు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ట్రిపుల్ తలాఖ్ ను అనేక ముస్లిం దేశాలు బహిష్కరించాయని కూడా ఇటీవల కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు.
తలాఖ్ పదంతో విడాకులు ఇచ్చే పద్ధతికి వ్యతిరేకంగా ‘భారతీయ ముస్లిం మహిళ ఆందోళన సంస్థ’ తలాఖ్ పద్ధతికి వ్యతిరేకంగా వీరందరినీ జతచేసి పోరాడుతోంది. గత ఏడాది 50 వేల మంది ముస్లింలు సంతకాలు చేశారు. మహిళల ఆత్మగౌరవానికి ఆవేదనకు ఏ మాత్రం విలువ ఇవ్వకపోవడం బాధాకరమని ముస్లింలు వాపోతున్నారు. అఖిల భారత ముస్లిం మహిళ పర్సనల్ లాబోర్డ్ అధ్యక్షురాలు షయిషా అంబర్ తలాఖ్ పై ఇటీవల స్పందిస్తూ తలాఖ్ పేరుతో విడాకులు ఇవ్వడం ఇస్లాం వ్యతిరేకమని అన్నారు. ఈ విధానాన్ని నిర్వీర్యం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సాంప్రదాయాన్ని రద్దు చేయడానికి తాను అన్ని ప్రయత్నాలు చేస్తానని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తలాఖ్ కు పూర్తి మద్దతిస్తూ మాట్లాడారు. బూటకపు సర్వేలతో ముస్లింల సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆక్షేపించారు. తలాక్ విషయంలో తప్పుడు సర్వేలను తెరపైకి తెస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన అన్నారు. తలాక్ విషయంలో 50వేల మంది ముస్లిం మహిళలను సర్వే చేసినట్టు చెబుతున్నారని, కానీ వాస్తవానికి కనీసం రెండు వేల మంది అభిప్రాయాలను కూడా సేకరించలేదని తమ దృష్టికి వచ్చిందని ఓవైసీ చెప్పారు.