మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

518
munugodu
- Advertisement -

మునుగోడులో బిజెపి గెలిస్తేనే భవిత
బి.ఆర్.ఎస్.ను ఆపాలంటే గెలవాలి
లేకుంటే కెసిఆర్ దూకుడును ఆపలేరట
కానీ మునుగోడులో బిజెపికి చుక్కెదురు
మునుగోడులో చేతులెత్తేసిన బిజెపి ?
అందుకే కమలం నేతలు మాట మార్చారా…?

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేసిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉన్నట్టుండి ఈ ఎనికలు తమకు ప్రతిష్టాత్మకం కాదు అని మాట మార్చడంపై రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మునుగోడు ఎన్నికల్లో బిజెపి చేతులెత్తేసిందని, అందుకే నేతలు మాట మార్చినట్లుగా కొందరు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బిజెపి ఎంపి డాక్టర్ కె.లక్ష్మణ్ మీడియాతో మునుగోడు ఎన్నికలను తమ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదని, ఈ ఎన్నికల్లో గెలిచినా… ఓడినా తమ పార్టీకి వచ్చే ప్రయోజనం ఏమీలేదని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సరికొత్త చర్చకు దారితీశాయి. అంతేగాక మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ఆస్ట్రేలియా వెళ్ళేందుకు టిక్కెట్టు బుక్ చేసుకొన్నారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మునుగోడు ఎన్నికల ఫలితం ఈ నెల 6వ తేదీన వస్తుందని, ఫలితం వచ్చిన వెంటనే అంటే తెల్లారిన వెంటనే ఆస్ట్రేలియా విమానం ఎక్కేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారంటేనే ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో కూడా బిజెపి నేతలకు ముందే తెలిసి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

సాధారణంగా గెలుస్తామని నమ్మకం ఉన్న నేతలు ఫలితాలు వచ్చిన తర్వాత తమకు టిక్కెట్టు ఇచ్చిన పార్టీ అధినేతలను కలిసి ధన్యవాదాలు తెలపడం, మీడియా సమావేశాలు నిర్వహించుకోవడం, గెలుపు సంబరాలు జరుపుకోవడం వంటి వాటితో కనీసం వారం పది రోజులైనా నేతలు బిజీబిజీగా గడుపుతారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫలితాలు వచ్చిన రెండో రోజునే ఆస్ట్రేలియాకు వెళుతున్నారంటేనే ఆయనకు ఎలాంటి ఫలితం రాబోతుందో ఒక క్లారిటీ వచ్చినట్లుందని అంటున్నారు. అదీగాక కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐ.బి) కూడా మునుగోడులో బిజెపికి వ్యతిరేకంగా తీర్పు రాబోతోందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదిక ఇచ్చినట్లుగా ఆ మధ్య వార్త గుప్పమన్నది. మునుగోడు ఉప ఎనికలు కేవలం 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాడాని ఓటర్లు అడుగడుగునా నిలదీయడంతోనే కమలం పార్టీ పెద్దలు, స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారని అంటున్నారు. అందుకే బిజెపి పాత నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పనిచేయడం లేదని, అందుకే రాజగోపాల్ రెడ్డి నల్గొండ పట్టణం నుంచే తమ సొంత అనుచరులు, కార్యకర్తలను వెంటబెట్టుకొని నియోజకవర్గంలో తిరిగారని, ఈ మొత్తం పరిణామాలను చూస్తుంటే మునుగోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

వాస్తవానికి మనుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్)ను ఓడించి తద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఇబ్బందులు పెట్టాలని బిజెపి ఢిల్లీ పెద్దలు ఎన్నో వ్యూహాలు రచించారని తెలిపారు. మునుగోడులో టి.ఆర్.ఎస్.ను ఓడించగలిగితే ఆ ఓటమిని
జాతీయస్థాయిలో ప్రచారం చేసి సొంత రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఒక్క చిన్న అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయాడనే కోణంలో ప్రచారం చేయాలని బిజెపి పథకం రచించిందని, అందుకే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న కమలం పార్టీ పెద్దలు ఎలాగైనా కెసిఆర్ స్పీడ్ కు బ్రేకులు వేయాలని
భావించారు. అందులో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలో తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు వస్తారని ప్రకటించారని, కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికను ఆధారంగా చేసుకొని అమిత్ షా పర్యటనను రద్దు చేసుకొని బిజెపి అధ్యక్షుడు జే.పి నడ్డాను మునుగోడు సభకు వస్తారని ప్రకటించారు. మునుగోడులో బిజెపి పరిస్థితి మరింతగా దిగజారడంతోనే చివరకు జె.పి.నడ్డా పర్యటన కూడా రద్దయ్యిందని వివరించారు. ఇలా అత్యంత ప్రతిష్టాత్మకంగా మునుగోడు ఉప ఎన్నికలను పరిగణించిన బిజెపి ఇప్పుడు బిజెపి బొక్కబోర్లా పడిపోయిందని అంటున్నారు.

టి.ఆర్.ఎస్.ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిని బిజెపిలోనికి చేర్చుకొని మానసికంగా దెబ్బతీయాలని బిజెపి ఢిల్లీ పెద్దలు చేసిన ప్రయత్నాలనీ బెడిసికొట్టడం, తెలంగాణ రాష్ట్రంలో, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలస్లీ బిజెపి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ వికటించడంతోనే ఆ పార్టీ ఎన్నికల్లో గెలుపుపై ఆశలు వదులుకున్నట్లుగా ఉందని, అందుకే మాట మార్చి ఈ ఎన్నికలు తమకు ప్రతిష్టాత్మకం కాదని అంటున్నట్లుగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలు నిర్వహించి కమలం గుర్తుపై మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే విధంగా చేసి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టి.ఆర్.ఎస్.ను ఇబ్బందుల్లోకి పడేయాలని వ్యూహాలు పన్నిన బిజెపి చివరకు తన ఎత్తులనీ చిత్తు అయ్యాయని గ్రహించి మీదటనే ఇలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లను డబ్బు, మందు, బంగారు నాణేలు, ఇతరత్రా బహుమతులు ఇచ్చి ఓటర్లను కొనుగోలు చేసైనా గెలవవచ్చునని బిజెపి నేతలు భావించారని, కానీ బిజెపి పార్టీ నేతలు ఇచ్చే బహుమతులన్నీ తీసుకొని ఓటు మాత్రం తమకు ఇష్టమైన పార్టీ గుర్తుకే ఓటు వేయాలని మునుగోడు ఓటర్లు తీసుకొన్న నిర్ణయాలు కమలం పార్టీ పెద్దలకు షాకిచ్చాయని అంటున్నారు. అందుచేతనే ఏమి చేసినా… ఎన్ని ప్రలోభాలు పెట్టినా… మునుగోడు ఓటర్లు నమ్మే పరిస్థితులు లేవని బిజెపి నేతలందరికీ తెలిసి వచ్చిందని అంటున్నారు. అందుచేతనే కమలం పార్టీ అగ్రనేతలు మాట మార్చారని, అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

కొరివితో తలగోక్కున్న బిజెపి

బండికి అధిష్టానం అక్షింతలు..

ప్రాంతీయ పార్టీలన్నీ అలర్ట్

- Advertisement -