ఐపీఎల్లో భాగంగా ఇవాళ దుబాయ్లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 9 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. 111 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై 14.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి గెలుపు తీరాలకు చేరింది.
ఓపెనర్ ఇషాన్ కిషన్ చిచ్చరపిడుగులా చెలరేగడంతో ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. రబాడా, నోర్జే, అశ్విన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. యువ కిషన్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 72 పరుగులు సాధించాడు. చివర్లో సిక్స్ కొట్టి విజయం ఖరారు చేశాడు.ఢిల్లీ బౌలర్లలో నోర్జే ఒక వికెట్ సాధించాడు. 26 పరుగులు చేసిన ముంబై ఓపెనర్ డికాక్.. నోర్జే బౌలింగ్ లో అవుటయ్యాడు.
అంతకుముందు బుమ్రా(3/17), ట్రెంట్ బౌల్ట్(3/21) దెబ్బకు ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(25), రిషబ్ పంత్(21) మాత్రమే కొంతసేపు పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోవాలని భావించిన ఢిల్లీకి నిరాశే ఎదురైంది. కీలక పోరులో బ్యాట్స్మెన్ సమిష్టి వైఫల్యంతో ఓటమి చవిచూసింది. 18 పాయింట్లతో ముంబై అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.