మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో నిన్న రైతులు నిర్వహించిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మృతి చెందిన రైతుల సంఖ్య ఐదుకి చేరింది. దాంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై అక్కడి రైతులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులకు ఆగ్రహం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి కలెక్టర్ కి దిమ్మతిరిగిపోయేలా చూపించారు ఆ రైతులు.
కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోవడంతో రైతుల మృతికి సానుభూతిగా బుధవారం అక్కడ బంద్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇదే సమయంలో ఘటనా స్థలంలో పరిస్థితిని పరిశీలించేందుకు కలెక్టర్ స్వతంత్ర కుమార్ పోలీసులతో కలిసి వచ్చారు.
అయితే, ఆయనకు స్థానికులు చుక్కలు చూపించారు. ఒక్కసారిగా రైతుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అక్కడ ఆందోళన తెలుపుతున్న 100 మందికి పైగా రైతులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేసేందుకు యత్నించారు. కొంతమంది ఆయనను కొట్టారు కూడా. దీంతో కలెక్టరు పరుగులు తీశారు. అయితే పోలీసుల సాయంతో కలెక్టర్ దాడుల నుంచి తప్పించుకున్నారు.
మాందసౌర్‌లో గత వారం రోజులుగా తమ పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేస్తూ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు మంగళవారం రోడ్లపైకి వచ్చి తమ ఆందోళనను తీవ్రం చేశారు.
రహదారులను ఎక్కడికక్కడ బ్లాక్ చేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు వచ్చిన భద్రతా బలగాలు.. వారిపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయారు.