రేవంత్ రెడ్డి క్యారెక్టర్ లేని మనిషి: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

33

రేవంత్ రెడ్డి క్యారెక్టర్ లేని మనిషి.. క్యాడర్‌ లేని పార్టీకి లీడర్‌ రేవంత్‌ రెడ్డి అని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు.మంగళవారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గాదరి కిశోర్‌తో కలిసి మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ డ్రగ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడో అన్నారన్నారు. ద బోస్టన్‌ టైమ్స్‌లో కాంగ్రెస్‌ ఘనకీర్తి వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. అభివృద్ధికి కేటీఆర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే.. రేవంత్‌ బ్లాక్‌ మెయిల్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని విమర్శించారు.

కేటీఆర్‌పై అనవసర విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మాకు తెలిసిన వైట్‌ వేరు.. దొంగలకు పెద్ద రేవంత్‌కు తెలిసిన వైట్‌ వేరన్నారు. ఒక వృత్తిని బతికించడానికి తాము ఆనాడే వైట్ ఛాలెంజ్ పెట్టామని, మాకు తెలిసిన వైట్ అంటే తెల్లకల్లు, రేవంత్‌రెడ్డికి తెలిసిన వైట్ డ్రగ్స్, గంజాయి అని ఆరోపించారు. తెలంగాణ ప్రతిష్టను రేవంత్ దిగజార్చుతున్నాడని.. పబ్బులు, క్లబ్బులు తెలంగాణలోనే ఉన్నాయా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవా? అని ప్రశ్నించారు. తెలంగాణ పరువు ప్రతిష్టలను, హైదరాబాద్ ఇమేజీని దెబ్బతీస్తున్న రేవంత్‌పై ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.