రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్. నేను నాగెలుపు కోసమే కష్ట పడ్డా తప్ప వేరే వాళ్ల ఓటమి గురించి ప్రయత్నించలేదని చెప్పారు. సొంత పార్టీ నేతలను ఓడగొట్టాలని చూసే వ్యక్తిత్వం తనది కాదన్నారు.
సోమారపు సత్యనారాయణ రాజకీయాలు ఏంటో రామగుండం ప్రజలకు తెలుసన్నారు. ఆయన పార్టీ మారితే వచ్చే నష్టం ఏమి లేదన్నారు. వ్యక్తిగత అవసరాల కోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సముచిత స్ధానం కల్పించామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపెట్టాలన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఒక పత్రికలో వచ్చిన వార్తను చూసి మా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని చెప్పారు. శంభీపూర్ రాజు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి అన్నారు. భూ కబ్జాలు, దందాలు చేయటం కాంగ్రెస్ నేతలకు అలవాటని విమర్శించారు.