మత్స్య కారుల అభివృద్ధి, మత్స్య సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం మరింత కషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అన్నారు.
కొత్త పంచాయతీరాజ్ చట్టం, చెరువుల్లో చేప పిల్లల విత్తనాలు వేయడం, చేపల చెరువుల మత్స్య సహకార సంఘాలకు చెరువుల కేటాయింపు తదితర అంశాలపై ఇద్దరు మంత్రులు, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్, పంచాయతీరాజ్, పశు సంవర్ధక శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, ఇతర అధికారులతో కలిసి హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ మంత్రి పేషీలో శుక్రవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు మాట్లాడుతూ, అడుగంటిక కుల వృత్తులను ఆదుకోవడానికి సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా, మత్స్య కారుల అభివృద్ధికి చెరువుల్లో చేపల విత్తనాలను ఉచితంగా వదులుతున్నారన్నారు. దీంతో మత్స్య సంపద పెరిగి, చేపలు పట్టేవారికి ఆదాయం పెరిగి మంచి అభివృద్ధిని సాధిస్తున్నారన్నారు. దీంతో చేపల చెరువులకు డిమాండ్ కూడా పెరిగిందన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అప్పటికే మనుగుడలో ఉన్న మత్స్య సహకార సంఘాలకు గ్రామ పంచాయతీల్లోని చిన్న, మధ్య తరహా చెరువులను లీజుకివ్వాలని నిర్ణయించిందన్నారు. అయితే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీల్లో కొన్ని సమస్యలు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని స్థానికంగానే నిబంధనలను అనుసరించి పరిష్కరించుకోవచ్చని సూచించారు. అయితే, నిబంధనల ప్రకారమే చెరువుల కేటాయింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, డి పి వో ల ను ఆదేశించాలని సెక్రెటరీ ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అధికారులను ఆదేశించారు.