ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తి దావఖానాలు విజయవంతం..

325
ktr
- Advertisement -

హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తి దావఖానాలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన బస్తీ దవాఖానాలను, తర్వాత కాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం విస్తరించిందని, ఈ బస్తి దావఖాన ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో 197 బస్తి దావఖానాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని మంత్రి తెలిపారు.

బస్తీ దవాఖానాలో ప్రభుత్వం నాణ్యమైన సేవలు అందించడంతో, వాటికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. హైదరాబాద్ నగరంలోని పేదలుండే చోటనే, పలు బస్తీలలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాల ద్వారా స్థానికంగా ఉన్న పేద ప్రజలకు వైద్య ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సేవలను ఉచితంగా అందుతున్నాయని, ఇలా వైద్య సేవలే తమ ప్రాంతానికి రావడంతో వాటిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్తి దావఖానల మెత్తం సంఖ్యను 300లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తాము పని చేస్తున్నామని, త్వరలోనే దశలవారీగా ప్రస్తుతం ఉన్న 197 సంఖ్యను 300కు పెంచుతామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. బస్తీ దవాఖానాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణ, జిల్లాల కలెక్టర్లు, మరియు పురపాలక శాఖ, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బస్తీ దవాఖానలో ప్రస్తుతం ఒక్కోదానికి కనీసం 100 మంది వరకు ఇన్ పేషెంట్ సంఖ్య ఉన్నదని మొత్తంగా సుమారు 197 ద్వారా ప్రతి రోజూ సరాసరి 25 వేల మందికి సేవలు అందుతున్నాయని అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. పేద ప్రజలు ఉన్న ప్రతి డివిజన్ లోనూ బస్తి దావఖాన ఉండాలన్నదే తమ లక్ష్యమని, అవసరమైన చోట్ల రెండు లేదా అంతకు మించి కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బస్తీ దవాఖానలతోపాటు నగరంలో ఉన్న 130కి పైగా అర్బన్ పీహెచ్సీల్లో కలిపి ప్రజలకు ప్రాథమిక వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నాయని, వీటితోపాటు వైద్యపరీక్షలు సైతం కొనసాగుతున్నాయని మంత్రి అన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని బస్తి దావఖానాలన్నీ ఇప్పటికే ఆన్లైన్ లోకి వచ్చాయని మిగిలిన వాటిని కూడా ఆన్లైన్ చేసి ఎప్పటికప్పుడు వాటి ద్వారా అందుతున్న వైద్యసేవలు సమీక్షిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. పేద ప్రజలకి ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో బస్తీ దవాఖాన విజయవంతమైన నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఉన్న ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామన్నారు. బస్తీ దవాఖాన లు మరియు అర్బన్ పీహెచ్సీలో కేవలం ఓపీ సేవలు మాత్రమే కాకుండా వారికి అవసరమైన టెస్టులు(వైద్య పరీక్షలు) కూడా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రికి అధికారులు తెలియజేశారు. జిహెచ్ఎంసి పరిధిలో ప్రతిరోజు సుమారు 5,000 టెస్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, వీటి సంఖ్య మరింత పెంచేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈ పరీక్షలు తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా చేస్తున్నామని, పరీక్షల ఫలితాలను కూడా మొబైల్ ఫోన్ ఉన్నవారికి వెంటనే చేరేలా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయంలో ఇతర ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రయత్నం కొనసాగుతుందని వైద్య శాఖ అధికారులు మంత్రి కేటీఆర్ గారికి తెలియ జేశారు. బస్తీ దవాఖాన లో పలుచోట్ల మూత్రశాలలు లేని విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటిని వెంటనే ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. మూత్ర శాలలు కట్టేందుకు స్థలం లేని చోట్ల మొబైల్ టాయిలెట్లను ఉంచుతామని తెలియజేశారు.

బస్తి దావఖాన వాళ్ల ద్వారా పేద ప్రజలకు కావలసినప్పుడు వైద్యసేవలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ వీటి సేవలను మరింత ప్రభావవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. బస్తి దావఖాన పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే మరో వంద బస్తి దావఖానాలు ఒకటి రెండు నెలల్లో ప్రారంభం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -