ప్రజలంతా లాక్ డౌన్‌కు సహకరించాలి- మంత్రి సత్యవతి

162
minister satyavathi
- Advertisement -

శుక్రవారం ఏటూరు నాగారం ఐటీడీఏలో కొవిడ్‌, ధాన్యం కొనుగోలు, విత్తనాలు, ఎరువుల పంపిణీపై రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ప్రాజెక్టు అధికారి హన్మంతు జెండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ఏడాది కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించడం వల్ల ఆర్థికంగా రాష్ట్రం మీద భారం పడిందని, ఈసారి లాక్ డౌన్ విధించకూడదని భావించారు. కానీ ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని సీఎం లాక్ డౌన్ విధించి, కఠినంగా అమలు చేస్తున్నారని, ప్రజలంతా దీనికి సహకరించాలని ఆమె కోరారు. లాక్ డౌన్ తర్వాత కొవిడ్ కేసులు బాగా తగ్గుతున్నాయని, కొవిడ్ బారిన పడ్డవారికి ప్రాణాపాయం లేకుండా చేపట్టిన వసతులు ఫలితాలు ఇస్తున్నాయన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫీవర్ సర్వే నిర్వహించడం ద్వారా కొవిడ్ లక్షణాలున్న వారిని ముందే గుర్తించి వారికి తగిన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. సీరియస్ గా ఉన్నవారిని హాస్పిటల్స్ లో చేర్పించి, వారికి ఆక్సిజన్ అందిస్తూ వారు కోలుకునేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.ధాన్యం కొనుగోలు కోసం సీఎం ఆలోచన మేరకు అధికారులు గోనె సంచులు, రవాణా వసతి సరిగా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సకాలంలో కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. రోహిణి కార్తె ప్రవేశించగానే మళ్లీ రైతులకు కావల్సిన విత్తనాలు, ఎరువులు అందించాలని, దీనికి సంబంధించి స్టాక్ నిర్వహించుకోవాలన్నారు.

ఇక కొవిడ్ బారిన పడి తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లలు అనాథలు కాకుండా ప్రభుత్వం వారి బాధ్యతలు తీసుకుంటదని మంత్రి తెలిపారు. అధికారులు ఇలాంటి పిల్లల విషయంలో చాలా మానవత్వంతో వ్యవహరించి, వారిని సంరక్షించాలని అన్నారు. కొవిడ్ వల్ల ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోవద్దని సీఎం కే సీఆర్‌ లాక్ డౌన్ విధించారని, ప్రభుత్వ హాస్పిటళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నారని చెప్పారు.

- Advertisement -