ప్లాస్టిక్ ఫ్రీ మేడారం జాతరకు చర్యలు: మంత్రి సత్యవతి

408
medaram jathara
- Advertisement -

మేడారం జాతరలో భక్తులకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి లోపాలుగాని, నిర్లక్ష్యం గాని ఉండకుండా చూసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేడారం జాతరపై అత్యంత శ్రద్ద పెట్టి ఆర్థిక మాంద్యం ఉన్నా 75 కోట్ల రూపాయలు ఇచ్చారని, వీటిని సద్వినియోగం చేసి భక్తులకు మంచి వసతులు కల్పించాలని కోరారు.

మేడారం జాతర పనులపై నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన శాఖ కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శంకర్ రావు, గిరిజన శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, గురుకులాల డిప్యూటీ సెక్రటరీ నికోలస్, డి.జి.ఎం శంకర్ రావు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.

మేడారం జాతరను బ్రాండింగ్ చేయడం, ముఖ్యమంత్రి గారికి మేడారం జాతర ఆహ్వాన పత్రిక ఇవ్వడం, అదే విధంగా దేశంలోని గిరిజన నేతలందరికి, ఇతర ముఖ్యులకు ఆహ్వానం పలికేందుకు మేడారం సంస్కృతిని ప్రతిబింబించే విధంగా గిరిజన శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఆహ్వాన పత్రికను పరిశీలించారు.

మేడారంలో మిగిలిన పనులు వేగంగా పూర్తి అయ్యేలా ప్రతి రోజు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహించే ఈ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో అనుభవమున్న అధికారులందరిని జాతర కోసం డిప్యూటేషన్ పై తీసుకురావాలన్నారు.

ప్లాస్టిక్ ఫ్రీ మేడారం జాతరపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు కొబ్బరికాయల కోసం క్లాత్ బ్యాగ్ లను అందించాలన్నారు. అదేవిధంగా మేడారంలోని దుకాణదారులు ప్లాస్టిక్ బ్యాగులు అమ్మితే జరిమానాలు విధించాలన్నారు. పర్యావరణాన్నిపరిరక్షించడంలో ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిల నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు కూడా వనదేవతల ఆశీర్వాదం కోసం అడవిని రక్షించేందుకు, ప్లాస్టిక్ నివారించేందుకు పూర్తిగా సహకరించాలని కోరారు.

మేడారం జాతరకు సంబంధించిన ప్రచారాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేయాలన్నారు. హైదరాబాద్ లోనూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే ప్రాంతాల్లో జాతర గురించి పబ్లిసిటీ చేయాలన్నారు. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఈసారి గతంకంటే మంచి ఫలితాలు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తూ, కావల్సిన భోజన, ఇతర వసతులు కల్పించాలన్నారు. పదో తరగతి తర్వాత, ఇంటర్ తర్వాత నిర్వహించే పోటీ పరీక్షల్లో కూడా గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అత్యధిక స్థాయిలో సీట్లు పొందేలా వారికి తగిన శిక్షణ అందించాలన్నారు.

- Advertisement -