గ్రీన్ ఛాలెంజ్‌తో హరిత తెలంగాణకు బాటలు..

311
minister sabhitha
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత తెలంగాణకు బాటలు వేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక హరిత ఉద్యమంలా దేశవ్యాప్తంగా విస్తరించడం శుభ పరిణామం అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలో గల వైఎం తండాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సివిల్స్ రైట్స్ డేను పురస్కరించుకొని రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు,విప్,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి,ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి,జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డిలతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ఆస్థి పాస్తులు ఇవ్వకున్న,స్వచ్ఛమైన గాలి అందించాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏటా తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారని అన్నారు. దాని ప్రతి ఫలమే నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. జంగల్ బచావో-జంగల్ బడావో కార్యక్రమంలో భాగంగా 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచే లక్ష్యంతో కార్యక్రమం కొనసాగుతుందన్నారు.తెలంగాణకు ఆకుపచ్చని మణిహారంగా హరితహారం నిలిచిపోతుందని మంత్రి పేర్కొన్నారు.

మరో వైపు ఒక మంచి ఆలోచనతో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి స్పందన వచ్చిందని, దేశ వ్యాప్తంగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి అనేక మంది మొక్కలు నాటుతున్నారని ఎంపీ సంతోష్‌ను మంత్రి ప్రశంసించారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా మొక్కలు నాటడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కీసర గుట్ట ఫారెస్ట్ అభివృద్ధికి ముందుకు రావడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమోయ్ కుమార్,అడిషనల్ కలెక్టర్ ప్రతిక్,ఎస్సి ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్, విద్యాసాగర్, చిలకమర్రి నరసింహ, పెద్ద సంఖ్యలో గిరిజన మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -