లైంగిక వేధింపులు.. దర్శకుడికి నోటీసులు..

104
filmmaker Anurag

బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అనురాగ్‌పై పాయల్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తనను రూమ్ కి పిలిచి, అసభ్యంగా ప్రవర్తించాడని, తన దుస్తులను తొలగించే ప్రయత్నం చేశాడని ఫిర్యాదులో తెలిపింది. తాను పిలిస్తే హీరోయిన్లు వచ్చి గడుపుతారని చెప్పాడని పాయల్ పేర్కొంది.

ఈ నేపథ్యంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ కు ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం సమన్లు జారీ చేశారు. అనురాగ్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 354, 341, 342 కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

కాగా, కేసుపై త్వరగా దర్యాప్తు చేయకపోతే తాను నిరాహారదీక్ష చేస్తానని పాయల్ ఘోష్ హెచ్చరించింది. అంతేకాదు, తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. దీనికితోడు, నిన్న మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలిసి ఇదే విషయంపై ఫిర్యాదు చేసింది. వీటన్నింటి నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ కు పోలీసులు సమన్లు జారీ చేశారు.