అప్రమత్తతతో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లాలోని పెవిలియన్ గ్రౌండ్‌లో బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బైక్ నడిపి అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పువ్వాడ…ప్రజల సహకారంతోనే రోడ్డు భద్రతను పెంపొందించడం సాధ్యమవుతుందన్నారు. ప్రయాణంలో వాహనఛోదకులు నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు.రెండో ప్రపంచయుద్ధంలో మరణించిన వారికంటే ఒక ఏడాదిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువమంది చనిపోతున్నారని చెప్పారు. సమష్టి కృషితో భద్రతా ప్రమాణాలను నిరంతరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సిర్ ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు.