Niranjan Reddy:వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలి

36
- Advertisement -

వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అమెరికాలో రెండో రోజు పర్యటించిన ఆయన…తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం అన్నారు. భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే పరిస్థితులు రావాలన్నారు. ఉన్నత చదువులు చదివి అమెరికాలో అత్యంత అధునాతన వేల ఎకరాల లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్షేత్రం నిర్వహిస్తున్న ప్రస్తుత యజమానులు అభినందనీయులు అన్నారు. అమెరికాలోని అత్యంత అధునాతన వ్యవసాయ క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచింది లాంగ్ వ్యూ ఫార్మ్. 1950ల్లో కెన్నెత్ మరియు లూయిస్ అనే జంట మొదలుపెట్టిన ఈ వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు వారి మునిమనవలైన నాలుగో తరం నడిపిస్తుండటం విశేషం.

అమెరికాలో వ్యవసాయ పరిస్థితులు భారతదేశ వ్యవసాయంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయన్నారు. ఇక్కడ భారీ కమతాలు, మానవ వనరుల కొరత వలన పెద్ద ఎత్తున యాంత్రీకరణ అనివార్యమయిందన్నారు. ఇక్కడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా మనదేశానికి భిన్నంగా ఉన్నాయన్నారు. ఇక్కడి రైతులు కొంత కార్పొరేటీకరణ వల్ల ప్రభుత్వం మీద పెద్దగా అధారపడటం లేదని మా అధ్యయనంలో అర్ధమయిందన్నారు. తెలంగాణలో చిన్న కమతాలు ఎక్కువ కాబట్టి భారీ యంత్రాల వినియోగం వ్యక్తిగత స్థాయిలో సాధ్యపడదు .. అందుకే రైతులు సహకార సమాఖ్యలుగా సంఘటితం అయ్యి యాంత్రీకరణ ఫలాలు అందుకోవాలన్నారు.

సహకార వ్యవస్థ బలోపేతం అయితేనే భవిష్యత్ లో కార్పొరేట్లకు ధీటుగా నిలబడటం సాధ్యపడుతుందని…సహకార శక్తి సంఘటితం అయితే ఏ కార్పొరేట్ శక్తి కూడా దాని ముందు నిలవలేదన్నారు.సహకార సంఘాలను విజయవంతంగా ఎలా నడపాలో మహారాష్ట్ర చక్కెర రైతుల అనుభవం నుండి, తెలంగాణ ముల్కనూరు సహకార సంఘాల నుండి నేర్చుకోవాలన్నారు. యాంత్రీకరణలో భాగంగా ప్రతి గ్రామంలో యంత్ర పరికరాలను చౌకగా అద్దెకు ఇచ్చేలా ఊబరైజేశన్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి చర్చ జరగాలన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగం కూడా యంత్ర శక్తిని విరివిగా వినియోగించుకోవడానికి అవసరమయ్యే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం అన్నారు.

Also Read:Nagma:నాకు ఓ తోడు కావాలి

దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వ్యవసాయ విధానాలు ఉన్నాయని .. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆదాయం, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు బంధు లాంటి పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో వ్యవసాయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు.

అమెరికా పర్యటనలో భాగంగా రెండో రోజు అయోవా రాష్ట్రంలోని లాంగ్ వ్యూ ఫార్మ్ అనే భారీ వ్యవసాయ క్షేత్రం సందర్శించారు. నూతన టెక్నాలజీ వినియోగంలో ఎంతో పురోగతి సాధించింది లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్షేత్రం. జీపీఎస్ ద్వారా ఒక్క సెంటీమీటర్ తేడా లేకుండా విత్తడం, భారీ యంత్రాల సాయంతో దున్నడం నుండి పంట నూర్పిళ్ల వరకూ పనులు చేయడం, హెలికాప్టర్లు మరియు డ్రోన్ల ద్వారా క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్, మొక్క ఎదుగుదలను ప్రతి స్టేజిలో డేటా సేకరించి మానిటర్ చేయడం వంటి వాటిని పరిశీలించింది మంత్రి బృందం.

లాంగ్ వ్యూ ఫార్మ్ సందర్శించిన బృందానికి సీఈఓ స్టీవ్ హెన్రీ అన్ని వివరాలతో కూడిన ఒక ప్రెజెంటేషన్ చేశారు. భారీ వ్యవసాయ క్షేత్రాలను నిర్వహించడంలో ఉండే సాధక బాధకాలను, తమ అనుభవాలను స్టీవ్ హెన్రీ పంచుకున్నారు. తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రధానంగా మొక్కజొన్న (కార్న్), సోయాబీన్ పండిస్తామని తెలిపారు. కేవలం ఆహార ధాన్యాలే కాకుండా, మేలురకమైన విత్తనాలను కూడా ఉత్పత్తి చేస్తామని, ఆహార ధాన్యాలతో పోలిస్తే విత్తన ఉత్పత్తి వలన లాభాలు మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నాయని, పశువులు, పందుల పెంపకం కూడా చేస్తున్నామని, భూసారాన్ని కాపాడుకోవడానికి, నెల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు.

అనంతరం ఇల్లినాయిస్ రాష్ట్రంలోని డికెటర్ నగరంలో ఫార్మ్ ప్రోగ్రెస్ షో కు హాజరై ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఫార్మ్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు. ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ’ఫార్మ్ ప్రోగ్రెస్ షో’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులను, ప్రముఖ వ్యవసాయ కంపెనీలను, సంస్థలను అనుసంధానిస్తుందన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, పశుసంపద, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సేంద్రీయ వ్యవసాయం, హార్టికల్చర్, వ్యవసాయ విద్య వంటి వ్యవసాయానికి సంబంధించిన వివిధ రంగాలకు చెందిన స్టాల్స్‌ పరిశీలించారు నిరంజన్ రెడ్డి.

Also Read:Prabhas:కల్కి రేట్ తెగేలా లేదు!

- Advertisement -