అవసరాలకు అనుగుణంగా తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి మాన్ సుఖ్ మాండవీయకి లేఖ రాశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను కేంద్రం కేటాయించింది.తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు నెలవారీగా కావాల్సిన ఎరువుల కోసం సెప్టెంబరులో కేంద్రానికి లేఖ ద్వారా విన్నవించింది రాష్ట్ర ప్రభుత్వం.
అక్టోబరు, నవంబరు మాసాలకు గాను 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను కేవలం 3.67 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించింది కేంద్రం.కేటాయించిన కోటాలో కూడా ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే సరఫరా చేయగా కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు నిరంజన్ రెడ్డి.
ఇతర దేశాల నుండి వచ్చిన వెసెల్స్ నుండి ఎరువులు కేటాయించాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. గంగవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ వెసెల్ నుండి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రమంత్రిని కోరారు. కాకినాడ, విశాఖ పోర్టులలో ఉన్న ఆర్ సీ ఎఫ్, ఛంబల్, ఐపీఎల్ ఫర్టిలైజర్స్ కు చెందిన వెసెల్స్ నుండి 30 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించాలన్నారు. క్రిబ్ కో కంపెనీ నుండి రెండు అదనపు రేక్ లు యూరియా కేటాయించాలని…అక్టోబర్, నవంబర్ నెలలలో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుండి మార్చి సరఫరాలో భర్తీ చేయాలన్నారు.