కేంద్రంపై మండిపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి..

147
- Advertisement -

తెలంగాణ నదీ జలాలు, మిషన్ భగీరధపై కేంద్రం అధికారాలు తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఖండించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సోమవారం ఆయన మంత్రుల నివాస సముదాయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..నదీ జలాలు తెలంగాణ జీవన్మరణ సమస్య.తెలంగాణ పచ్చబడడం కొంత మంది జీర్ణించుకోలేక పోతున్నారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయాలను తెలంగాణ ఆమోదించదు అని మండిపడ్డారు. గతంలో మాదిరిగా నిర్ణయాలు తీసుకుని తెలంగాణ మీద రుద్దుతామంటే కాలమే సమాధానం చెబుతుంది. తెలంగాణ బతుకంతా నీళ్లకోసమే కొట్లాడుతున్నది. దురదృష్టవశాత్తు కేంద్రం అవలంభిస్తున్న తీరు అత్యంత విచారకరమన్నారు.

ట్రిబ్యునల్ కు అప్పగించకుండా కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య హక్కులు మా పరిధిలోకి తీసుకుంటామంటూ గెజిట్ విడుదల చేసింది. ఇది తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవడమే అవుతుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రాజెక్టులు నిర్మించుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో కేంద్రం మోకాలడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం చేయూత ఇవ్వడం లేదు. తెలంగాణ తన మానాన తాను ప్రాజెక్టులు కట్టుకుంటుంటే సహరించకుండా కేంద్రం కుట్ర చేస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం.. తెలంగాణకు జీవన్మరణ సమస్య ఇది. కేంద్రానిది 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకుదెరువును దెబ్బతీసే ప్రయత్నమని మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పురోగమిస్తుంటే కొందరికి నచ్చడం లేదు. కేంద్రం ఈ రకమైన వైఖరి తగదు.. ఇది ఇరు రాష్ట్రాలకు నష్టమే అన్నారు. ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కేంద్రం తెచ్చిన గెజిట్ ను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకు తీసుకెళ్తారని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగుల విషయంలో నేను మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న దానికి సంబంధం లేదు. తెలంగాణ సర్కారు ఏ గ్రామానికి ఆ గ్రామంలో కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేసి హమాలీల ద్వారా ధాన్యం సేకరణ చేస్తుందని చేసిన వ్యాఖ్యలకు నిరుద్యోగ యువతకు ముడిపెడుతూ ప్రచారం చేస్తున్నారు.

రాష్ట్రంలో వందకు వంద శాతం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలో నోటిఫికేషన్ కు సంబంధించిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది.యువత పూర్తిస్థాయిలో ఉద్యోగ అవకాశాల మీద దృష్టి పెట్టి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. నా వ్యాఖ్యల విషయంలో జరిగిన అవాస్తవాల ప్రచారం నమ్మి ఎవరైన బాధపడితే క్షంతవ్వ్యుణ్ణి. రాజకీయ పరమైన లబ్దికోసమే మాట్లాడుతున్నారు తప్ప ప్రజల ప్రయోజనాలకు లోబడి ఏ పార్టీ నోరు విప్పడం లేదని మంత్రి దుయ్యబట్టారు. రాజకీయాలు చేయదలుచుకున్న వారు ఎక్కడైనా చేస్తారు. కేంద్రంలో ఉన్న 7 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ఎంపీలు బాధ్యత తీసుకుని పనిచేస్తారా ? అని మంత్రి ప్రశ్నించారు.

దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రధాన రాష్ట్రాలు బీహార్, యూపీ , మహారాష్ట్ర , కర్ణాటక, గుజరాత్ , తమిళనాడులలోని జనాభాతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 1.5 శాతం మించలేదు. అటువంటిది తెలంగాణలో ఉద్యోగుల శాతం ఇతర రాష్ట్రాలకు మించి అధికంగా ఉంది.. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలను నిరంతరంగా భర్తీ చేస్తుంది. నిరుద్యోగులు విపక్షాల విషప్రచారాన్ని వదిలేసి ప్రభుత్వ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎరువుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నెలవారీ వాటాపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళేందుకు రేపు ఢిల్లీకి వెళ్తున్నాం.

నది జలాల విషయంలో కేంద్రం ఇచ్చిన గెజిట్ పై జాతీయ పార్టీలు మరోసారి అక్కసు వెళ్లగక్కేలా వ్యవహరిస్తున్నాయి.గెజిట్ నోటిఫికేషన్ అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర పార్టీల ఎంపీలు గెజిట్ పై పార్లమెంట్ సమావేశాల్లో ఏం మాట్లాడుతారో ప్రజలకు స్పష్టం చేయాలి. మిగిలిన రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని ఎందుకు ఎండగట్టడం లేదు అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -