అబద్దాల పాలన ఇంకెన్నాళ్లు: హరీశ్‌ రావు

15
- Advertisement -

డబ్బా కొట్టుకోవడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు హితవు పలికారు. నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా MGNREGS ఉద్యోగులు, నెల గడిచినా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక వెతలు పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు.

ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొందని తెలిపారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు.

నెలలు గడిచినా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై, అప్పుల పాలవుతున్నారని తెలిపారు. కండ్లు కాయలు కేసులా జీతాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. కుర్చీ కాపాడుకోవడం కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, విదేశాలకు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామనే డబ్బా ప్రచారం చేసుకోవడం మానేసి పాలనపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికైనా చిరు ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓలు ఇలా వేల మంది చిరు ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్న దయనీయ పరిస్థితి నెలకొందని అన్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.

Also Read:737 మంది పాలస్తీనియన్ల విడుదల..

- Advertisement -