వనపర్తిలో సురవరం ప్రతాపరెడ్డి గారి 67వ వర్ధంతి సందర్భంగా వారి కాంస్యవిగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి…సురవరం పాలమూరు ప్రతిష్ట అన్నారు. సుధీర్ఘకాలం లేకపోయినా 13 నెలలే శాసనసభ్యులుగా ఉన్నా సాహితీ, సాంస్కృతిక, సాంఘీక ఉద్యమాల ద్వారా చేసిన కృషి అనన్యసామాన్యం అన్నారు.- వర్తమానానికి, భావితరాలకు సురవరం కృషి తెలియాలి .. అది చిరస్మరణీయంగా నిలవాలన్నారు.
అందుకే వారి కాంస్య విగ్రహాన్ని వనపర్తిలో సెప్టెంబరు 9న కాళోజి నారాయణరావు గారి జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించబోతున్నాం అన్నారు. తెలంగాణ భాషకు, తెలుగు భాషకు గొప్ప కీర్తిని గడించిన సురవరం గారి విగ్రహం సాహితీ మితృలు, తెలంగాణ వాదుల సూచన మేరకు ఆవిష్కరించుకోవడం గొప్పతనంగా భావిస్తున్నాం అన్నారు.
వనపర్తిలో సురవరం ప్రతాపరెడ్డి పేరు మీద ఒక పార్కు నిర్మించాలని మున్సిపాలిటీ నిర్ణయించింది .. మున్సిపాలిటీ పాలకమండలికి ధన్యవాదాలు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి గారి ఆశయసాధన కొనసాగింపు తెలంగాణ ఉద్యమంలో జెండాను ఎత్తిన సాధారణ కార్యకర్తగా నా బాధ్యతగా భావించి వారి కీర్తి పతాక చిరస్థాయిగా ఎగరాలని వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.
సురవరం ప్రతాపరెడ్డి పేరు మీద ఒక సంచిక 400 పేజీలతో రెండు సంపుటాలుగా తీసుకురావడం జరుగుతుందని…. ఇది సురవరం గారి మీద అధ్యయనం చేసేందుకు ఈ సంకలనం ఉపయోగపడుతుందన్నారు. వనపర్తి శాసనసభ్యులుగా సురవరం కొద్దికాలమే పనిచేసినా వారి స్ఫూర్థిని భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం .. దీనికి సహకరిస్తున్న సాహితీవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. సెప్టెంబర్ 9న కాంస్య విగ్రహ ఆవిష్కరణకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలోని కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ఆహ్వానిస్తాం అన్నారు.