ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కెటి రామారావు, ఈటల రాజెందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ తదితరులు భారీ వర్షాలు, వరదల ప్రభావిత వరంగల్ నగరంలో మంగళవారం పర్యటించారు. మంత్రులు కెటి రామారావు, ఈటల రాజెందర్ ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్ కు హెలికాప్టర్ లో వెళ్లారు. వారి వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తుజా రిజ్వి, డిహెచ్ఇ రమేశ్ రెడ్డి ఉన్నారు.
వరంగల్ లో ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు వారితో జత కలిశారు. కేటీఆర్ నాయకత్వంలోని బృందం వరంగల్ నగరంలోని నయీం నగర్, సమ్మయ్య నగర్, గోపాలపూర్, పెద్దమ్మగడ్డ – యూనివర్సిటీ రోడ్, పోతన నగర్, బొందివాగు రోడ్, రామన్నపేట, హంటర్ రోడ్, సంతోషిమాత గుడి ప్రాంతం, ఉర్సు, రంగశాయిపేట, శివనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. చాలా చోట్ల ముంపుకు గురైన ప్రజలతో మాట్లాడి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. దెబ్యతిన్న రోడ్లను పరిశీలించారు. ఫాతిమా – కెయు వంద ఫీట్ల రోడ్డులో గోపాలపూర్, సమ్మయ్య నగర్ ప్రాంత వాసులతో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిస్థితి చక్క బడే వరకు నిత్యావసర సరుకులు అంద చేస్తామని హామీ ఇచ్చారు.
హంటర్ రోడ్డులో కేటీఆర్ సహా ఇతర ప్రజా ప్రతినిధులు వరద నీటిలోనే నడుస్తూ పరిస్థితిని పరిశీలించారు. చాలా చోట్ల నాలాలపై ఆక్రమణ వల్లే వరదలు సంభవించినట్లు స్థానికులు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొన్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సభ్యులను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
మంత్రుల బృందం వరంగల్ లోని ఎంజిఎంలో కోవిడ్ వార్డును సందర్శించింది. మంత్రులు కేటీఆర్, ఈటల రాజెందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పిపిఇ కిట్లు ధరించి కోవిడ్ వార్డులోకి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
కావాల్సిన మందులు, పరికరాలు, ఇంజక్షన్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, నిపుణులైన వైద్యులు, ఇతర సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నాయని, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులను, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. కరోనా సోకిన వారి దగ్గరికి రావడానికి సమీప బంధువులే జంకుతున్న సమయంలో కేటీఆర్ సహా మంత్రులంతా ఎంతో తెగువతో కోవిడ్ వార్డులోకి వెళ్లి, చికిత్స పొందుతున్న వారితో నేరుగా మాట్లాడడంతో వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నగర మేయర్ గుండా ప్రకాశ్ రావు, కలెక్టర్ రాజీవ్ హన్మంతు, పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పామెల్లా, కుడా చైర్ పర్సన్ మర్రి యాదవ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.