డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సందర్శించిన కేటీఆర్..

222
minister ktr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చురుగ్గా కొనసాగుతున్నదని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం ఇప్పుడు కొనసాగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్  మాసానికి సుమారు 85వేల ఇళ్లను పేదలకి అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు ఆయన కొల్లూరులో జిహెచ్ఎంసి నిర్మిస్తున్న భారీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాజెక్టుని శాసనసభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన అక్కడ కొనసాగుతున్న పనులను సమీక్షించారు. స్పీకర్ మరియు మంత్రులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, అక్కడ ఉన్న సౌకర్యాలు, పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.ఆ తర్వాత అక్కడి కాంట్రాక్ట్ ఏజెన్సీ తోపాటు అధికారులతో సమావేశమయ్యారు. అంతకుముందు ముగ్గురు నిర్మాణం పూర్తయిన ఇళ్లల్లోకి వెళ్లి వాటిని స్వయంగా పరిశీలించారు.

ఈ టౌన్ షిప్ రికార్డుల్లోకెక్కుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇళ్ళు లేని నిరుపేదల కోసం, ప్రత్యేకంగా టౌన్ షిప్ నిర్మించడం బహుశా ప్రపంచంలోనే మొదటిసారి అన్నారు. అన్ని వసతులతో, ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ కొల్లూరు మోడల్ టౌన్ షిప్ పేదలకు వరం అన్నారు. దేశంలోనే పేదల హౌసింగ్ కార్యక్రమాల్లో కొల్లూరు ఒక ఆదర్శమైన ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు.

హైదరాబాద్ లో జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పైన,వాటి పురోగతి పైన హర్షం వ్యక్తం చేసిన హౌసింగ్ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తమ శాఖ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ సందర్భంగా మంత్రులు,స్పీకర్ కొల్లూరులో కల్పించాల్సిన సౌకర్యాల పైన కొన్ని సలహాలు సూచనలు అందించారు.

- Advertisement -