తెలంగాణ పెట్టుబడులకు అనువైన ప్రదేశం: కేటీఆర్

247
ktr
- Advertisement -

యు ఎస్ ఐ బి సి ఇన్వెస్ట్మెంట్ వెబీనార్ లో మంత్రి కే తారకరామారావు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులకు ఉన్న అవకాశాల పైన ఆయన ప్రసంగించారు. భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ కంపెనీలు స్థూలంగా భారతదేశాన్ని ఒక యూనిట్గా కాకుండా తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ రాష్ట్రాలను ఒక యూనిట్ గా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. స్థూలంగా అన్ని రాష్ట్రాలను కలిపి చూసినప్పుడు ఉండే పెట్టుబడి అవకాశాలకు, పరిస్థితులకు ప్రత్యేకంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు అవకాశాలకు చాలా తేడా ఉంటుందని… గత ఆరు సంవత్సరాల్లో దేశంలోని అనేక రాష్ట్రాల కన్నా భిన్నంగా తనదైన తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తూ వస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

దేశంలోనే అత్యంత తక్కువ వయసు కలిగిన రాష్ట్రం అయిన తెలంగాణ నూతన విధానాలు మరియు ప్రభుత్వ నిర్ణయాల పరంగా వినూత్నమైన పంథాలో ముందుకు పోతున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన విధానాల ద్వారా గత ఆరు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తుందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన ts-ipass విధానం ద్వారా కేవలం పదిహేను రోజుల్లోనే అన్ని రకాల పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్నామని, ఇప్పటికే ఈ విధానం విజయవంతం అయిందని, అనుమతులు ఇచ్చిన వాటిలో 80 శాతానికి పైగా కార్యకలాపాలను ప్రారంభించిన ఈ విషయాన్ని ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి 14 రంగానికి ప్రాధాన్యత రంగాలుగా గుర్తించిందని ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి సంపూర్ణ సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ మరియు ఫార్మా రంగానికి సంబంధించి బలమైన ఈకో సిస్టం ఇక్కడ ఉందని, ప్రస్తుతం అమెరికా వంటి అగ్ర రాజ్యం సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా మందుల పైన ప్రధానంగా ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో పాటు అనేక ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత అతి పెద్ద ప్రాంగణాలను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైస్ పార్క్ తెలంగాణలో ఉన్నదని ఈ రంగంలోనూ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇన్వెస్ట్మెంట్ వెబీనార్ లో పాల్గొన్న అమెరికన్ కంపెనీల అధినేతలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.ముఖ్యంగా టీ ఐపాస్ విధానం, ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న మద్దతు పైన తెలంగాణ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల అధినేతలు ప్రశంసించారు.

యు ఎస్ ఐ బి సి ప్రెసిడెంట్ నిషా బిశ్వాల్ తెలంగాణకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావడంలో యు ఎస్ ఐ బి సి తెలంగాణ కి అండగా ఉంటూ వస్తుందని భవిష్యత్తులోనూ దీని కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ప్రభుత్వ విధానాలు పరిశ్రమలకు అందిస్తున్న చేయూత ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం ఉన్న కరోణ సంక్షోభం తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తో కలిసి పని చేస్తామాన్నారు. ఈరోజు అమెరికా కు చెందిన ఫార్మా, టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ, రిటైల్ వంటి రంగాల నుంచి పదుల సంఖ్యలో పెట్టుబడిదారులు, కంపెనీల అధినేతలు వెబినార్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు

- Advertisement -