మానేరు వాగులో ఆరుగురు విద్యార్థులు గల్లంతయిన ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వీరి మృతదేహాల కోసం గాలింపు జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలురు గల్లంతు కావడం పట్ల రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పైన జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. చనిపోయిన బాలుర కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నియోజకవర్గంలోని జలవనరులు సంపూర్ణంగా నిండి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని కేటీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వద్ద సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం తరఫున ఆయా కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.
కాగా,విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు జరుగుతోంది. నిన్న రాత్రి ఒక విద్యార్థి మృతదేహం లభించింది. అతన్ని 8వ తరగతి చదువుతున్న గణేశ్ గా గుర్తించారు. ఈ ఉదయం మరో మృతదేహం లభించగా.. అతన్ని వెంకటసాయిగా గుర్తించారు. కాసేపటి క్రితం రాకేశ్ అనే విద్యార్థి మృతదేహం లభించింది. మిగిలిన విద్యార్థులు క్రాంతి, అజయ్, మనోజ్ కోసం సహాయకబృందాలు గాలింపు జరుపుతున్నాయి.