హైదరాబాద్ వికారాబాద్‌లో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టును మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నామని, ఈరోజు చారిత్రాత్మకమైన రోజు అన్నారు.
ఎమర్జింగ్ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అధునాత టెక్నాలజీతో మందులను సరఫరా చేస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేయవచ్చని వెల్లడించారు. ఆరోగ్య రంగంలోనే కాదు, అనేక రంగాల్లో డ్రోన్ వాడొచ్చని తెలిపారు.
సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తారని, సామాన్యుడికి ఉపయోగంలేని సాంకేతికత వ్యర్థమని చెబుతారని గుర్తుచేసిన కేటీఆర్…మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లను వాడుతున్నామని, అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్ చప్పుళ్లకే భయపడతారని వెల్లడించారు. మైనింగ్ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను కట్టడి చేయవచ్చన్నారు.