యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీ..

129
ktr in uk
- Advertisement -

తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కే తారకరామారావు పర్యటన తొలిరోజు బిజీబిజీగా కొనసాగుతుంది. తొలిసారిగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను ఇక్కడి సంస్థలకు కంపెనీలకు పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా యునైటెడ్ కింగ్ డం ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధి బృందాలకు తెలంగాణ రాష్ట్రంలోని వ్యాపార వాణిజ్య అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు.

ముఖ్యంగా టీఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా-లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు కోసం తీసుకువచ్చిన పాలసీలు, వాటితో ఇప్పటిదాక తెలంగాణకు వచ్చిన భారీ పెట్టుబడుల వివరాలను కంపెనీ ప్రతినిధులకు తెలియచేశారు. తెలంగాణ రాష్ట్ర వినూత్నమైన పారిశ్రామిక పాలసీలతో పాటు పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, భూమి,నీళ్లు విద్యుత్ సదుపాయాలతో పాటు నాణ్యమైన మానవ వనరులు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, పాలసీలు ప్రోత్సాహకాలు తెలంగాణలో ఉన్నాయన్న కేటీఆర్, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు.

అన్నింటికన్నా ముఖ్యంగా దేశంలోని ఇతర నగరాల్లో లేని అసలు సిసలైన కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్ లో మాత్రమే ఉందన్నారు. ఇండియాలో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా అనేకసార్లు అవార్డులను హైదరాబాద్ అందుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు లైఫ్ సైన్సెస్- ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు ఒక హాబ్ గా మారిందని తెలిపారు. పలు మల్టీనేషనల్ కంపెనీలు అమెరికా ఆవల తమ అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో మాత్రమే ఏర్పాటుచేశాయన్న సంగతిని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భారతదేశం కోణంలో నుంచి మాత్రమే తెలంగాణను చూడొద్దన్న కేటీఆర్, తమ రాష్ట్రంలోని వినూత్న, విప్లవాత్మక విధానాలు, అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.

డెలాయిట్, హెచ్ఎస్బిసి, జెసిబి, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మరియు తెలంగాణ అధికార ప్రతినిధి బృందం ఉన్నది.

- Advertisement -